ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా
ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. అయితే అపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి కోరారు. మరో వైపు జూన్ 5న సాయంత్రం ఎన్డీయే నేతల కీలక సమావేశం ఉంది. ఇప్పటికే ఎన్డీయే నేతలు, చంద్రబాబు,పవన్ కళ్యాణ్, నితీశ్ కుమార్,తేజస్వి యాదవ్ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్నారు. జూన్ 4న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 293 సీట్లతో మెజారిటీ సాధించింది. దీంతో మూడోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జూన్ 7న పార్లమెంటరీ పక్షనేతను ఎన్నుకోనున్నారు ఎన్డీయే నేతలు. జూన్ 8న మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఫలితాలపై ఇండియా కూటమి నేతలు కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో సమావేశం కానున్నారు.