NDA రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ నామినేషన్

 దిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో ఆయన అతిరథ మహారథుల సమక్షంలో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, అమిత్‌షా, మురళీమనోహర్‌ జోషీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, నితిన్‌గడ్కరీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు. మొత్తం నాలుగు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయగా.. రామ్‌నాథ్‌ను ప్రతిపాదిస్తూ తొలి నామినేషన్‌ పత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ, రెండో పత్రంపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, మూడో నామినేషన్‌ పత్రంపై అమిత్‌షా, నాలుగో పత్రంపై అకాళీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ సంతకాలు చేసిన విషయం తెలిసిందే.నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం రామ్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ అత్యున్నత పదవికి మరింత వన్నె తెచ్చేలా ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు.ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ నేతృత్వంలోని పలు విపక్షాలు తమ అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ఈ నెల 27 లేదా 28 తేదీల్లో నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.