ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. న‌మ్మ‌క‌మే దానికి పునాది: ప్ర‌ధాని మోదీ

ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. దానికి న‌మ్మ‌క‌మే పునాది అని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఎన్డీఏ నేత‌గా త‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం అదృష్ట‌వంతుడిగా భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. మీరంద‌రూ కొత్త బాధ్య‌త‌ను అప్ప‌గించార‌ని, దానికి కృత‌జ్ఞ‌తుడినై ఉంటాన‌న్నారు.

న్యూఢిల్లీ: ఎన్డీఏ కూట‌మి మ‌ధ్య బంధం బ‌లోపేతం కావ‌డానికి న‌మ్మ‌క‌మే కీల‌క‌మైంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఇవాళ పార్ల‌మెంట్‌హాల్‌లో జ‌రిగిన ఎన్డీఏ కూట‌మి మీటింగ్‌లో ఆయ‌న మాట్లాడారు. ఎన్డీఏ ప‌క్ష నేత‌గా మోదీని ఎన్నుకున్న త‌ర్వాత ఆయ‌న ప్ర‌సంగించారు. ఎన్డీఏ నేత‌గా త‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం అదృష్ట‌వంతుడిగా భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. మీరంద‌రూ కొత్త బాధ్య‌త‌ను అప్ప‌గించార‌ని, దానికి కృత‌జ్ఞ‌తుడినై ఉంటాన‌న్నారు. 2019లో ఇదే స‌భ‌లో మాట్లాడుతున్న స‌మ‌యంలో.. అప్పుడు కూడా త‌న‌ను లీడ‌ర్‌గా ఎన్నుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో న‌మ్మ‌కం ఎంత బ‌ల‌మైంద‌న్న విష‌యాన్ని చెప్పాన‌ని గుర్తు చేశారు. ఇప్పుడు మీరు అంద‌జేస్తున్న బాధ్య‌త కూడా ఆ బంధం నుంచి పుట్టింద‌న్నారు. మ‌న మ‌ధ్య ఉన్న విశ్వాస బంధం మరింత బ‌లోపేతంగా మారింద‌న్నారు. ఈ బంధం ఓ బ‌ల‌మైన పునాది మీద ఏర్ప‌డింద‌న్నారు. ఇదే అతిపెద్ద అసెట్ అని ఆయ‌న పేర్కొన్నారు.