స్టోర్ రూమ్ కు చేరిన సినారె చిత్రపటం

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 27. (జనం సాక్షి).

సాహిత్య అభిమానుల ఆవేదన.

జ్ఞానపీఠ అవార్డు గ్రహీతకు ఇచ్చే గౌరవం ఇదా…

అసమానమైన తన సాహిత్య సృజనతో మారుమూల గ్రామం నుంచి తెలంగాణ గౌరవాన్ని జాతీయస్థాయిలో వినిపించిన సాహితీవేత్త డాక్టర్ సినారె జ్ఞానపీఠ అవార్డుతో సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాక తెలంగాణ యాసకు భాషకు ఎనలేని గౌరవం తెచ్చారు.డాక్టర్ సినారె అందించిన స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అంది రావాలనే సంకల్పంతోని గత ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయానికి ఆయన పేరును పెట్టి గౌరవించింది. అప్పట్లో సిరిసిల్ల మున్సిపాలిటీ కూడా గ్రంధాలయ ఆవరణలో డాక్టర్ సి నారాయణ రెడ్డి విగ్రహం పెట్టాలని ప్రతిపాదన కూడా వచ్చింది. జిల్లా గ్రంధాలయం ప్రస్తుతానికి నిరుద్యోగ యువకులకు పాఠకులకు ఎంతో విలువైన సమాచారం అందిస్తూ విజ్ఞాన కేంద్రంగా కొనసాగుతోంది. గతంలో అనేక సాహిత్య సమావేశాలకు వేదికగా నిలబడింది. విద్యార్థులకు గ్రంథాలయాన్ని కేటాయించడంతో గత కొంతకాలంగా సాహిత్య సమావేశాలకు అవకాశం లేకుండా పోయిందని ఓ సాహిత్య అభిమాని ఆవేద వ్యక్తం చేశారు.డాక్టర్ సి.నారాయణ రెడ్డిని గౌరవిస్తూ గతంలో గ్రంధాలయంలో సీనారే చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. సాహిత్య కారులు ఎంతో సంతోషించారు. సాహిత్య అభిమానులు డాక్టర్ సినారెకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎంతో అనువుగా ఉండేది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకో ఏమో గాని చిత్రపటం స్టోర్ రూమ్ చేరడంతో సాహిత్యాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో గ్రంధాలయ సిబ్బందిని అడిగిన సాహిత్య అభిమానులకు చేదు అనుభవమే ఎదురయింది. అప్పట్లో చైర్మన్ తొలగించమంటేనే తొలగించామని ఎదురు సమాధానం చెప్పడంతో సాహిత్య అభిమానులు నివ్వేరపోయారు.డాక్టర్ సి.నారాయణ రెడ్డి జయంతి ఉత్సవాలు జూలై 29న ఉండడంతో సాహిత్య అభిమానుల్లో నివాళులు అర్పించేందుకు అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు డాక్టర్ సినారె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏమో గాని గ్రంథాలయంలో ఉన్న చిత్రపటాన్ని స్టోర్ రూమ్ కు చేర్చడం మండిపడుతున్నారు. తక్షణం సినారె చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.చెడిపోతుందని నేనే తీయించా….ఆకునూరి శంకరయ్య. జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్.వర్షాలు కురుస్తుండడంతో తేమ వచ్చి చిత్రపటం చెడిపోతుందని నేనే తీయించా.. పదవీకాలం ముగిసింది కాబట్టి ఇప్పుడు నాకే సంబంధం లేదు.