భద్రాచలం వద్దరెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. సోమ‌వారం ఉద‌యం 46 అడుగుల వ‌ద్ద ప్ర‌వ‌హించింది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యానికి 48 అడుగులు చేర‌డంతో రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశారు. అయితే ఎగువన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నది ఉగ్రరూపం దాల్చింది. సాయంత్రం నాటికి నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.అదేవిధంగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదారమ్మ మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నది. మొదటి ప్రమాద హెచ్చరిక 14.830 మీటర్లు కాగా, ప్రస్తుతం 15.130 మీటర్లు వుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రతగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.భద్రాద్రి జిల్లాలో ఉన్న రెండు ప్రాజెక్టులకు వరద నీరు చేరింది. కిన్నెరసానిలో 16 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదలిపెట్టారు. 407 అడుగుల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 403.30 అడుగులు నీటిమట్టం ఉంది. సాయంత్రానికి ఆరు గేట్లు ఎత్తివేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో మొత్తం 25 గేట్లను ఎత్తి 92,121 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గోదావరి వరద ప్రభావం వల్ల అక్కడ ఈతవాగు పొంగడంతో గుంపల్లి చర్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పర్ణశాలలో సీతవాగు పొంగి ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం మండలంలో గుబ్బలమంగి ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరడంతో సున్నంబట్టి, కాశీనగరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.