పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ఎంతో కీలకం
గోదావరిఖని, జనంసాక్షి : ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్bకుమార్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో భాగంగా మొబైల్ టవర్లు, కాలుష్యం, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాలతో పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ఎంతో కీలకమని, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద నీరు, గింజలు ఉంచడం, చెట్లు నాటడం, పిచ్చుకలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం ద్వారా వాటి సంఖ్యను పెంచవచ్చని తెలిపారు.
పట్టణీకరణ వల్ల పిచ్చుకలు గూళ్లు కట్టుకునే ప్రదేశాలు తగ్గిపోవడం కూడా వాటి అంతరించి పోవడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చిన్నచిన్న చర్యల ద్వారా పిచ్చుకలను కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్జీ.1 జిఎం, డి లలిత్ కుమార్ గ్రీన్ వారియర్ జె.వి.ఎస్. చంద్రశేఖర్, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగితో కలిసి అటవీ శాఖ రూపొందించిన పిచ్చుకల సంరక్షణ అవగాహన కోసం పోస్టర్‌ను అర్ద్జి.1 జియం కార్యాలయం నందు ఆవిష్కరించారు.



