తెలంగాణ డీఎస్సీ రాత పరీక్ష వాయిదా

డీఎస్సీ రాత పరీక్ష వాయిదాఅసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో తెలంగాణలో ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగ నియమాక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. తాజాగా, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షను కూడా వాయిదా పడింది. నవంబరు 20 నుంచి 30 వరకూ జరగాల్సిన డీఎస్సీ రాత పరీక్షను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. తదుపరి రాత పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీని వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 30 జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వం మొత్తం 5,089 ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను సెప్టెంబ‌ర్ 8 విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు సంవత్సరాల తరబడి కళ్లుకాయలు కాసేలా ఎదురుచూశారు.కానీ, కొన్ని పోస్టులతోనే నోటిఫికేషన్ విడుదల చేసి మమ అని పించారు. మొత్తం 5,082 పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి. కాగా, షెడ్యూల్ ప్రకారం నవంబర్‌ 20 నుంచి 30 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించాల్సి ఉంది. నవంబర్‌ 20, 21న స్కూల్‌ అసిస్టెంట్లు (సబ్జెక్టు), నవంబర్‌ 22న స్కూల్‌ అసిస్టెంట్‌ (లాంగ్వెజ్‌) నవంబరు 23న ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నవంబరు 24న లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు రెండు విడతల్లోనూ.. నవంబరు 25 నుంచి 30 వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ ప్రకటించారు. కానీ, నవంబరు 30నే ఎన్నికల పోలింగ్ ఉండటం వల్ల ఈ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికి వచ్చి వాయిదా వేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 22 వేలు ఖాళీలు ఉన్నట్టు గతంలో ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదిక ఇచ్చింది. ప్రమోషన్లు, రేషలైజేషన్‌‌‌ తీసివేస్తే 13 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ ఇప్పుడు 5,089 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు ఊసూరుమంటున్నారు. ఏదో నోటిఫికేషన్ వచ్చిందిలే అనుకుని పరీక్షలకు సిద్ధమవుతుండగా.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది.. పరీక్షల సమయంలోనే పోలింగ్ తేదీని నిర్ణయించడంతో అనివార్యంగా వాయిదా వేశారు. పరీక్షల కొత్త షెడ్యూల్‌పై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తాజావార్తలు