జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య : దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని, (జనంసాక్షి) : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు అన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంథని గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తాలో వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగానే పాకిస్తాన్ తీవ్రవాదులు జమ్మూకాశ్మీరు పై విరుచుకుపడి అమాయకులైన యాత్రికులను కాల్చి చంపడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాంటివి పునరాకృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్యకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలను తరిమి కొట్టాలని అన్నారు. దేశ భద్రతను కాపాడాల్సిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నదని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమరులైన పౌరులకు నివాళులు అర్పిస్తూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో తెలంగాణ వాసి, ఐబీ అధికారిమనీష్ రంజన్, మృతి చెందిన 28 మంది పట్ల శ్రీను బాబు విచారం వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల, పట్టణ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.