తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ ఇష్టారాజ్యం…!
చెన్నారావుపేట, నవంబర్ 30 (జనం సాక్షి):
కిందిస్థాయి ఉద్యోగులపై పెత్తనం…
సీసీఎల్ ఏ కు ఫిర్యాదు చేసిన రెవెన్యూ ఉద్యోగులు….
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు…
చెన్నారావుపేట తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న నాయబ్ తహసిల్దార్ రజిని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుందని కొందరు రెవెన్యూ ఉద్యోగులు హైదరాబాదులోని సీసీఎల్ఏలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం రెవెన్యూ శాఖలో ఆదివారం కలకలం రేపింది. చెన్నారావుపేట నాయబ్ తహసిల్దార్ గా పనిచేస్తున్న రజిని కార్యాలయంలోని కిందిస్థాయి ఉద్యోగులైన జిపిఓలు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ సిబ్బందిని చులకనగా చూస్తూ దురుసుగా ప్రవర్తిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మండలంలోని 13 గ్రామాలకు జిపిఓ లను కేటాయించగా జిపిఓ లు గ్రామాలలో విచారణ జరిపి పరిష్కరించాల్సిన వివిధ ధ్రువీకరణ పత్రాలు, కల్యాణ లక్ష్మి దరఖాస్తుల విచారణ, ఇతరత్రా పనులను చేయనివ్వకుండా పని మనుషుల కంటే హీనంగా చూస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక జిపిఓలకు బదులు కార్యాలయంలో పనిచేయాల్సిన జూనియర్ అసిస్టెంట్లతో పనులు చేపిస్తున్నట్లు పలువురు జిపిఓలు, రెవెన్యూ సిబ్బంది బాహాటంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కార్యాలయంలో స్టేషనరీ ఖర్చు, దరఖాస్తులకు సంబంధించిన ప్రింటుల ఖర్చులను తమ సొంతంగా డబ్బులు ఖర్చు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు పలువురు ఆరోపించారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ దురుసుగా మాట్లాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పని విషయం గురించి మాట్లాడాలని ఆమె వద్దకు వెళితే తమను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తనకు ఇష్టం వచ్చినట్లుగా వర్క్ ఆర్డర్లు మారుస్తూ తహసిల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగులను గ్రామాలలో ఫీల్డ్ మీదికి పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ చేయాల్సిన పనులను జూనియర్ అసిస్టెంట్లకు అప్పగిస్తూ తన ఆధిపత్యాన్ని చలాయిస్తుందని సహచర ఉద్యోగులే ఆమెపై ఆరోపణలు చేయడం గమనార్హం. ఆమెకు అనుకూలంగా ఉన్నవారికి ఆర్థికంగా లాభం ఉన్న పనులను అప్పగిస్తూ మిగతా ఉద్యోగులను చులకనగా చూస్తూ విధులకు ఆటంకం కలిగిస్తుందని పలువురు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గెజిటెడ్ ఉద్యోగిని ఫ్లయింగ్ స్క్వాడ్ గా పంపాల్సి ఉండగా కార్యాలయానికి చెందిన నాన్ గెజిటెడ్ ఉద్యోగిని ఫ్లయింగ్ స్క్వాడ్ గా పంపడం వెనక పలు విమర్శలకు తావిస్తోంది. ఏది ఏమైనా నాయబ్ తహసిల్దార్ రజిని పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పలువురు రెవెన్యూ ఉద్యోగులు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లిఖితపూర్వకంగా సీసీఎల్ ఏ కు ఫిర్యాదు చేసి వేడుకున్నారు. ఈ విషయం చెన్నారావుపేట మండలంలో చర్చనీయాంశంగా మారింది.



