హాస్టల్‌లో మేముండలేం.. గోడ దూకి 19 మంది విద్యార్థులు పరార్‌

అర్ధరాత్రి కాలినడకన జనగామకు చేరుకున్న విద్యార్థులుపెంబర్తి మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్‌లో ఘటన| జనగామ రూరల్‌, జూలై 12: సీనియర్‌ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్‌ గోడదూకి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్‌లో జరిగింది. ఇక్కడి హాస్టల్‌లో ఉంటున్న 19 మంది విద్యార్థులు.. వసతులు నచ్చక, సిబ్బంది వేధింపులు తట్టుకోలేక అర్ధరాత్రి హాస్టల్‌ గోడదూకి జనగామ ధర్మకంచలో ఉన్న పాత హాస్టల్‌కు సుమారు ఆరు కిలోమీటర్లు కాలినడకన చేరుకున్నారు. అర్ధరాత్రి విద్యార్థులు హాస్టల్‌ నుంచి వెళ్లిపోతే.. సిబ్బంది కనీసం సమాచారం ఇవ్వలేదని మధ్యాహ్నం ధర్మకంచలోని హాస్టల్‌ ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పెంబర్తిలోని జ్యోతిబాఫూలే పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని, ఇక్కడ ఉండటానికి ఇబ్బందిగా ఉందని తెలిపారు. సీనియర్‌ విద్యార్థులు, టీచర్లు వేధిస్తున్నారని, సౌకర్యాలు లేవని అడిగితే ఇక్కడ ఇలాగే ఉంటుందని బెదిరిస్తున్నారని వాపోయారు. జనగామలోని ధర్మకంచ హాస్టల్‌లో సౌకర్యాలు ఉన్నాయని, ఇక్కడి నుంచి పెంబర్తి హాస్టల్‌కు మార్చారని పేర్కొన్నారు. గతంలో ఉన్న హాస్టల్‌లోనే ఉంటామని విద్యార్థులు నినాదాలు చేశారు. అధికారులు స్పందించి ధర్మకంచ హాస్టల్‌లో ఉందే విధంగా కృషి చేయాలని కోరారు. రాయలేని భాషలో ఉపాధ్యాయులు బూతులు తిడుతున్నారని చెప్పారు. పెంబర్తి హాస్టల్‌లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలున్నాయని ప్రిన్సిపాల్‌ అనిత పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగొద్దనే పెంబర్తిలో మరో బిల్డింగ్‌ అద్దెకు తీసుకున్నామని, బూతులు తిట్టే ఉపాధ్యాయులపై శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.