అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

share on facebook

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ.. వేలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి వైరస్‌ ‘కరోనా’పై దేశప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కరోనా వైరస్‌ను నిలువరించే విధంగా ప్రజలు స్వీయనిర్బంధంలో ఉండాలని ప్రధాని ఆదేశించారు. ఇందుకు గానూ దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే.. నీ దేశాన్ని రక్షించుకోవాలంటే స్వీయనిర్బంధం పాటించాలని ప్రధాని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నిలువరించాలంటే 21 రోజులు స్వీయనిర్బంధంలో ఉండాలని వైద్యనిపుణులు సూచించినట్లు ప్రధాని తెలిపారు.

ఈ అర్ధరాత్రి నుంచి 21 రోజుల వరకు దేశం మొత్తం లాక్‌డైన్‌లో ఉంటుందని ప్రధాని తెలిపారు. ఈ మహమ్మారి వైరస్‌ను నిలువరించడానికి 21 రోజులు అవసరమని గుర్తు చేశారు. ఇవాళ ప్రధాని జాతినుద్ధేశించి మాట్లాడుతూ.. 21  రోజులు ఇంట్లో జాగ్రత్తగా ఉందాం.. దేశాన్ని కాపాడుకుందామని తెలిపారు. ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌ ప్రతి ఇంటికి లక్ష్మణరేఖ అని ప్రధాని పేర్కొన్నారు. కరోనా సోకినవారు తొలుత సాధారణంగానే ఉంటారనీ.. కాబట్టి ఇతరులను కలిసే ప్రయత్నం చేయారాదన్నారు. ఈ వ్యాధి లక్షణాలు బయట పడేందుకు కొన్ని రోజుల పడుతుంది గనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఈ వ్యాధి బారిన పడిన మొదటి లక్ష మంది గుర్తించడానికి 67 రోజులు పట్టిందనీ, అనంతరం కేవలం 11 రోజుల్లోనే ఆ సంఖ్య 2 లక్షలకు చేరిందని ప్రధాని తెలిపారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే బాధితుల సంఖ్య 3 లక్షలకు చేరిందన్నారు. రానున్న 21 రోజులు దేశానికి చాలా కీలకమని పీఎం తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందనీ.. కానీ, ప్రజల ప్రాణాలు కాపాడాలంటే ఈ కఠిన నిర్ణయం తప్పనిసరి అని ప్రధాని అన్నారు. ఈ 21 రోజులు మన ప్రాణాల కంటే ఎక్కువ కాదని, ప్రధాని నుంచి గ్రామస్తుల వరకు సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని ప్రధాని తెలిపారు.

ఈ మహమ్మారి పట్ల నిర్లక్ష్యం చేయబట్టే చైనా, ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా లాంటి దేశాలు ప్రస్తుతం చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కుంటున్నాయని ప్రధాని వెల్లడించారు. అలాంటి పరిస్థితులు మన దగ్గరికి రాకూడదంటే స్వీయనిర్బంధం పాటించాలని ప్రధాని తెలిపారు.

Other News

Comments are closed.