ఎన్నికల సంఘానికి మరో శేషన్‌ రావాలి

share on facebook

చట్టాలను చేయడం తప్ప..వాటిని పాటించడం…అమలు చేయడం వంటి విషయాల్లో మన రాజకీయనేతలు ఎప్పుడూ వెనకబడే ఉంటారు. చట్టాలంటే గౌరవం లేకుండా పోతున్న వేళ చట్టసభల్లో వారు సభ్యులు కావాలని ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఎన్నికయ్యాక ఈ చట్టాలను తమ చుట్టాలుగా చేసుకుని అక్రమ సంపాదనే ధ్యేయంగా రాజకీయాలను వ్యాపారంగా మార్చి వేస్తున్నారు. రాజకీయాలంటే ఓ వ్యాపారంగా మారిన వేళ గెలవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు.తాము మంత్రులం…ముఖ్యమంత్రులం…మాజీ మంత్రులం అన్న స్పృహ లేకుండా ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల ప్రసంగాలంటేనే జుగప్స కలిగించేలా మాట్లాడుతున్నారు. గెలవడం ప్రధానం అయినప్పుడు ఎదుటివారిని ఎలా విమర్శిస్తే ఏమిటి? వారి ఇమేజ్‌ డామేజ్‌ అయితేనేం …అన్న ధోరణిలో హద్దు విూరుతున్నారు. అయితే చట్టాలు చట్టుబండలవుతున్న వేళ ఎన్నికల సంఘంలో  శేషన్‌ లాంటి ఎన్నికల ప్రధాన  అధికారి లేకపోవడం…కొరడా ఝళిపించకపోవడంతో మరోమారు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వారి నోటిని అదుపులో పెట్టండని ఇసిని గట్టిగా ఆదేశిస్తే తప్ప మొద్దు నిద్రలో ఉన్న ఎన్నికల సంఘం మేల్కొనలేక పోయింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న వేళ అదుపుతప్పిన రాజకీయ నాయకుల ప్రసంగాలకు కళ్లెం వేసే దిశగా ఎట్టకేలకు ఎన్నికల సంఘం గట్టి చర్యలకు ఉపక్రమిం చింది.  విద్వేష పూరిత, నిందాపూర్వక ఉపన్యాసాలు చేసేవారిపై దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా నిషేధాస్త్రం సంధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత అజంఖాన్‌లు 72 గంటల పాటు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీలు 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది. ఇదంతా కూడా సుప్రీం జోక్యం చేసుకోవడం తోనే సాధ్యమయ్యిందని గమనించాలి. అంటే ఇంత జరుగుతన్నా.. ఎక్కడి నుంచయినా ఫిర్యాదు అందినా స్పందించని విధంగా  మన ఇసి మొద్దునిద్ర పోతోంది. ఇవన్నీ తెలియకనా..అంటే తెలిసీ చేస్తున్నవే.  అందుకే విద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై సత్వర చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘం పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటివారిపై చర్యలు తీసుకోవటానికి ఉన్న అధికారాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పనందుకు న్యాయస్థానం మండిపడింది. ఇలా అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అరగంట వ్యవధిలో కోర్టుకు హాజరయ్యేలా ఆదేశిస్తామంటూ ఒక దశలో హెచ్చరించింది. ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం, భాషల ఆధారంగా ప్రచారం చేసే నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ షార్జాలో యోగా టీచరుగా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు హార్‌ప్రీత్‌ మన్‌సుఖాని దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ దీపక్‌ గుప్త, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే ఓ పిటిషన్‌ దాఖలయిన నేపథ్యంలో సుప్రీం విచారణకు స్వీకరించి పిలించేంత వరకు ఇసి ఏం చేస్తున్నదన్నది అర్థం కాని ప్రశ్న. అందుకే విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతిలపై ఇంతవరకు తీసుకున్న చర్యలేమిటో వివరించాలని గట్టిగనే ప్రశ్నించింది. ఏమి చేస్తున్నారో చెప్పండి… ఇంతవరకు ఏ చర్యలు తీసుకున్నారంటూ నిలదీసింది. ఇలాంటి సందర్భాల్లో చట్టం ఏమని చెబుతోంది? సమాధానం ఇవ్వండని ప్రశ్నించింది. ఇందుకు ఈసీ తరఫు న్యాయవాది సమాధానం ఇస్తూ ఈ విషయంలో ఈసీకి ఉన్న అధికారాలు చాలా తక్కువ. మేము నోటీసు ఇచ్చి సమాధానం అడగగలం.
పార్టీ గుర్తింపును రద్దు చేయడానికిగానీ, అభ్యర్థిని అనర్హునిగా ప్రకటించడానికిగానీ మాకు అధికారాలు లేవు. మేం సలహాలను జారీ చేయగలం. అదే తప్పును పదేపదే చేస్తుంటే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగలం అని వివరించారు. ఈ రకంగా తనకుతానుగా ఇసి బేల తనాన్ని ప్రదర్శించింది. తాను కోరలు లేని పులినని చెప్పుకుంది. కానీ గతంలో ఇదే సీటులో కూర్చున్న శేషన్‌ అన్న ఐఎఎస్‌ అధికారి ఎన్నికల సంఘం చట్టాల ఆధారంగానే రాజకీయ నాయకులకు వణుకు పుట్టించాడన్న విషయాన్ని మరచిపోయింది. నిస్సిగ్గుగా నాకు చేతకాదని సుప్రీం ముందు వాదించింది. దీనిపై తీక్షణంగా స్పందించిన ధర్మాసనం అంటే..విద్వేషపూరిత ప్రసంగాలను నివారించడానికి కోరలు లేవు, అధికారాలు లేవని చెప్పదలచుకున్నారా అని ప్రశ్నించింది. నోటీసు ఇవ్వడం, సలహాలు పంపడం, క్రిమినల్‌ కేసు నమోదు చేయించడంతో పాటు ఇంకేవిూ చేయలేరా అని అడిగింది. ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకునేందుకు ఈసీకి చట్టపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయాన్ని పరిశీలి స్తామని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు ఆగ్రహం అనంతరం ఎన్నికల సంఘం తక్షణమే స్పందించింది. ఆదిత్యనాథ్‌, మాయావతి, మేనకా గాంధీ, అజంఖాన్‌లపై చర్యలు తీసుకుంటూ విడివిడిగా ఉత్తర్వులు ఇచ్చింది.  ఆదిత్యనాథ్‌, ఆజంఖాన్‌లు 72 గంటలపాటు, మాయావతి, మేనకా గాంధీ 48 గంటల పాటు దేశంలో ఎక్కడా ప్రచారం చేయకూడదంటూ నిషేధం విధించింది. ఈ ఆదేశాలు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. మొత్తానికి ఇసి కఠినంగా వ్యవహరించడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నదో తెలియాలి. ఉన్న చట్టాల గురించి కూడా తెలియనంత వెర్రిగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు?ఇది కావాలని చేస్తున్న చర్య తప్ప మరోటి కాదు. ఇలాంటి అసమర్థ అధికారుల కారణంగా ఎన్నికల సంఘం పరువు పోతోంది. ఎన్నికల్లో ధనం, మద్యం విపరీతంగా ప్రవహిస్తోంది. నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. సుప్రీం ఆదేశాలు ఎన్నికల సంఘానికి కనువిప్పు కలిగించాలి. ఇకనైనా కఠినంగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలి. అలా చూడలేని అధికారులు తక్షణం రాజీనామా చేసి పోవాలి. దీనికి మరో పరిష్కారం లేదని గుర్తించాలి.

Other News

Comments are closed.