మంత్రులంతా కష్టపడి వుంటే.. మరిన్ని మెరుగైన ఫలితాలొచ్చేవి
` సమన్వయం లేక.. రెబెల్స్‌ను నివారించక కొన్నిచోట్ల నష్టం
` మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలు సైతం సరిగ్గా పనిచేయలేదు
` మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటి
` జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పాఠాలుగా తీసుకోవాలని సూచన
` పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సుదీర్ఘ విశ్లేషణలు
హైదరాబాద్, డిసెంబర్ 22 (జనంసాక్షి) :
పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 60శాతంపైగా స్థానాలను దక్కించుకున్నప్పటికీ.. ఆ పార్టీలో సుదీర్ఘ విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏయే జిల్లాల్లో వెనుకబడ్డాం.. ఎక్కడ ఆధిక్యత సాధించాం అనే అంశాలపై పార్టీ పెద్దలు నెమరువేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఏఐసీసీ ఇన్‌చార్జి నటరాజన్ పలువురు ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అంతర్గత సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యే, ఇన్‌చార్జీలు కలిసికట్టుగా పనిచేసి వుంటే మరిన్ని మెరుగైన ఫలితాలొచ్చేవని విశ్లేషించినట్టు సమాచారం. భారీ విజయమే దక్కించుకున్నామని ఆయన ప్రకటించినా.. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో వాటిని రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పాఠాలుగా తీసుకోవాలని సూచించారట..!
మంత్రులతో కీలక సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఫలితాలు ఇంకా ఆశించినంత రాలేదని అసంతృప్తి వెలిబుచ్చినట్టు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో (ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న 18 చోట్ల) బీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. సమన్వయ లోపాలు, రెబల్స్‌ను నియంత్రించలేకపోవడం, కుటుంబ పాలన (నెపోటిజం), ఎమ్మెల్యేలు, మంత్రుల బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం వల్ల కొంతమేర నష్టం జరిగిందని చెప్పారట. అదేవిధంగా 16 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందని మంత్రుల దగ్గర్నుంచి ఆరాతీసినట్టు సమాచారం. మున్ముందు రాబోయే ఎన్నికల్లో ఇప్పటి తప్పిదాలను పునరావృతం కాకుండా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించిన సీఎం.. 42 శాతం రిజర్వేషన్ అమలుపైనా వారితో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.
ఎక్కడెక్కడ ఎలా ఉంది?
ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషించారట. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలవారీగా ఫలితాలు ఎలా వచ్చాయనే దానిపై సమగ్రంగా చర్చించినట్టు తెలిసింది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వాటి వివరాలు కూడా సీఎం అడిగినట్టు వినబడుతోంది. తన ఇలాకా కొడంగల్‌లో కాంగ్రెస్ దాదాపు 80శాతం గెలుపు బావుట ఎగురవేయడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం భావిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఎన్నికల్లోనూ మరింత చురుగ్గా కాంగ్రెస్ సైన్యం కదలాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో సీఎం ఆదేశించినట్టు తెలిసింది. పార్టీకి నష్టం చేసినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.



