ఎవరికి వారే వసూల్ రాజా

సర్కిల్ లో భారీగా అక్రమ నిర్మాణాలు
నోటీసులు ఇవ్వరు… కూల్చివేయరు
కమిషనర్ ఆదేశాలు గాల్లోకి వదిలేసిన అధికారులు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 14 జనంసాక్షి :
జిహెచ్ఎంసి పరిధిలో 30 సర్కిళ్ళు ఉంటే 29 సర్కిళ్లకు టౌన్ ప్లానింగ్ రూల్స్ ఒకలా ఉంటే ఒక్క మల్కాజిగిరి సర్కిల్ కి మాత్రం ప్రత్యేక రూల్స్ ఉన్నాయి…
మల్కాజిగిరి సర్కిల్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల పనులు శూన్యం.అక్రమ వసూళ్లలో ఉన్న బాధ్యత పనులలో లేదు.ఎవరికివారు వారి బాధ్యతను తప్పించుకొని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు.అక్రమ నిర్మాణాల గురించి సర్కిల్ డిసిని అడిగితే టౌన్ ప్లానింగ్ డిసిపి ఏ ఫైల్ కానీ, కంప్లైంట్ కానీ నా వరకు తీసుకురావడం లేదంటారు. డిసిపిని అడిగితే నాకు అసలు సంబంధం లేదు అంత జోనల్ వాళ్లే వస్తారు,చూసుకుంటారు అంటారు. ఎన్ఫోర్స్మెంట్ వారిని అడిగితే మాకు ఎవరు  రిపోర్టు ఇవ్వలేదు అంటారు. ఇలా ఎవరికి వారు బాధ్యతయుతంగ ప్రవర్తించకపోవడం వల్ల ఇదే అదునుగా అక్రమ నిర్మాణాదారులు అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఎవరికి వారు వసూల్ రాజాలు అయ్యారే తప్ప ఏ ఒక్క అధికారి వాటి మీద యాక్షన్ తీసుకోవడం లేదు.
జిహెచ్ఎంసి మల్కాజిగిరి సర్కిల్ ఓల్డ్ నేరెడ్ మెట్ ఎక్స్ రోడ్డు నుండి మల్కాజిగిరి రోడ్డు నెంబర్ 4,5 మధ్యలో మెయిన్ రోడ్డును ఆనుకుని 100 గజాలల్లో అక్రమ సెల్లార్ వేసి నిర్మాణం చేపడుతున్నారు. వినాయక్ నగర్ లో మల్కాజిగిరి ప్రధాన రహదారిలో 200 గజాలల్లో అక్రమ సెల్లార్ తో పాటు 4 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. నిర్మల్ నగర్ సర్కిల్ బాబు జగ్జీవన్ రాం రోడ్డులో అక్రమ సెల్లార్ తో కూడిన 3 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఇవి ప్రధాన రహదారుల వెంట ఉన్నవి మాత్రమే మచ్చు తునకలుగా చెప్పుకోవచ్చు… ఇంకా సర్కిల్ మొత్తం కలిపి కొన్ని వందల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.వీటి మీద ఫిర్యాదులు వచ్చినా కూడా అధికారులు నోటీసులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. భారీగా ముడుపులు ముడుతున్నాయనే నిరంతర ఆరోపణలు ప్రతి రోజు వస్తున్నా..కళ్ళ ముందు కొన్ని వందల అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఒక్క నోటీసు కూడా ఇవ్వకపోవడం రూ.కోట్లల్లో దందా నడుస్తున్నట్లు తెలుస్తుంది.నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే మాకు నోటీసు ఇచ్చే అధికారం లేదని మల్కాజిగిరి సర్కిల్ డీసీపీ అనడం విస్మయం కలిగిస్తుంది.గతంలో కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని అడుగగా నా పని ఆన్లైన్ లో వచ్చిన టీఎస్బిపాస్ అప్లికేషన్లు చూడటం, కోర్టు కేసులు చూసుకోవడం వరకే  అని సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం సర్కిల్ టౌన్ ప్లానింగ్ డీసీపీ కూడా మాకు సంబంధం లేదు అనడం పైస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.30 సర్కిళ్లకు సంబంధించి డీసీ, డిసిపి, ఏసీపీ, ఎన్ఫోర్స్మెంట్, న్యాక్ టీమ్ అందరూ సమన్వయంతో అక్రమ కట్టడాలను తొలగించాలని జిహెచ్ఎంసి కమీషనర్ ఆదేశాలు జారీ చేసినా కూడా వీరి పంథా మారడం లేదు.ఇటీవల సికింద్రాబాద్ లో ఒక అక్రమ బిల్డింగ్ లో సెల్లార్ లో లాగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతే కానీ అధికారులు పట్టించుకోరేమో అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
 టౌన్ ప్లానింగ్ అధికారుల విధులు
జిహెచ్ఎంసి 30 సర్కిళ్లల్లో ఏ సర్కిల్ లో అయినా నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు తీసినా, అధిక అంతస్తులు వేసినా, నాళాలు, రోడ్డు అక్రమించినా,సెట్ బాక్ లేకపోయినా,ఫైర్ సేఫ్టీ లేకపోయినా, రోడ్డు మీద ,నాళాల మీద నిర్మాణాలు చేపట్టినా,సెల్లార్ లో నిర్మాణాలు చేపట్టినా న్యాక్ ఇంజినీరింగ్ వారు మానిటర్ చేసి కేస్ బుక్ చేసి డిసిపి, ఏసీపీ కి అందించాలి.అది అక్రమ నిర్మాణమా కాదా అనేది డీసీ ద్వారా నోటీసు పంపి చెక్ చేయాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ వారికి ఉంది.ఒకవేళ అక్రమ నిర్మాణం అని తేలితే స్పీకింగ్ ఆర్డర్ లు డీసీ సమన్వయంతో పంపాల్సి ఉంటుంది.ఎన్ఫోర్స్మెంట్ టీమ్ వచ్చి ఆ నిర్మాణాన్ని డిమోలిష్ చేస్తుంది. ఇది అన్ని సర్కిళ్లలో ఇప్పటివరకు ఇదే కొనసాగుతుంది కానీ ఒక్క మల్కాజిగిరి సర్కిల్ లో మాత్రం భిన్నంగా ఉంది. జోనల్ ఆఫీసు నుండే అధికారులు వచ్చి ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో చూసుకుని జోనల్ ఆఫీసు నుండి నోటీసు పంపి డిమోలిష్ చేస్తారు అనే సమాధానం మల్కాజిగిరి సర్కిల్ డీసీపీ చెప్పడం విస్మయం కలిగిస్తుంది.
 అక్రమ వసూళ్లకు కూడా ప్రోటోకాల్
ఒక సర్కిల్ లో గతంలో పని చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి వసూళ్లు చేసి వెళ్ళిపోతే కొత్తగా వచ్చిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కు ఎన్ని కంప్లైంట్ లు వచ్చినా ఆ బిల్డింగును ముట్టుకోరట.దీన్ని బట్టి ఈ విభాగం ఎంత వసూళ్లు చేస్తుందో పై స్థాయి అధికారులు గమనించాలి.
జోనల్ ఆఫీసు వారే నోటీసులు ఇస్తారు మాకు సంబంధం ఉండదు
-డీసీపీ గజానంద్, మల్కాజిగిరి
అక్రమ కట్టడాల మీద నోటీసులు ఇచ్చే అధికారం మాకు లేదు. అంతా జోనల్ వారికే సంబంధం ఉంటుంది.జోనల్ ఆఫీసు వారే వచ్చి ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా చూసి నోటీసులు ఇస్తారు.మేము కేసులు మాత్రమే బుక్ చేస్తాము. ఇప్పటికి కొన్ని బిల్డింగుల మీద కేసులు బుక్ చేసాము. కొన్ని కోర్టు కేసులల్లో ఉన్నవి కూడా నిర్మాణాలు చేపడుతున్నారు.వాటికి మేమేం చేయలేము.
ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు
– ఎఎంసి నర్సింగ్, మల్కాజిగిరి
గత నెల చివర ఈ బాధ్యత మాకు యాడ్ చేశారు. మొన్నటి వరకు గణేష్ నిమజ్జనం డ్యూటీ లో ఉన్నాము. ఈ రెండు రోజుల నుండి సర్కిల్ లో ఉంటున్నాము. న్యాక్ ఇంజనీర్లు ఒక్క కంప్లైంట్ కూడా నా దగ్గరకు తీసుకురాలేదు.కాబట్టి ఒక్క నోటీసు కూడా మేము ఇవ్వలేదు. ఏదైనా మా దృష్టికి వస్తే కేస్ బుక్ చేసి నోటీసు డీసీ ద్వారా పంపిస్తాము. గతంలో బుక్ చేసిన కేసుల గురించి,నోటీసుల గురించి నాకు తెలియదు.
నా వరకు ఏమి రావడం లేదు
-డీసీ రాజు, మల్కాజిగిరి
గతంలో డిపిఎంఎస్ ఉండేది కాబట్టి కొంత మాకు టౌన్ ప్లానింగ్ మీద అధికారం ఉండేది.కానీ ప్రస్తుతం అన్ని సెక్షన్ లు ఆన్లైన్ అయ్యాయి.ఏదైనా వారిది వారే చూసుకుంటున్నారు.నా వరకు ఏమి రావడం లేదు. ఏదైనా నోటీసు ఇవ్వాల్సి వస్తే నేను సంతకాలు పెడుతున్నాను. కానీ ఇన్స్పెక్షన్ చేయాల్సింది టౌన్ ప్లానింగ్ వారు నోటీసు కోసం నా వరకు ఎవరు రానప్పుడు నేనేం చేయగలను.ఇక్కడ ఉన్న అన్ని రకాల సెక్షన్స్ ని మానిటర్ చేయడం,అడ్మిస్ట్రేషన్ మాత్రమే మాకు ఉంది.