ఎసిబి కస్టడీకి ఇఎస్‌ఐ స్కాం నిందితులు

share on facebook

హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కామ్‌ దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ కేసులో ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణితో పాటు ఆరుగురు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులుబుధవారం తెలిపారు. విచారణ నిమిత్తం నిందితులను బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు నిందితులను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని ఏసీబీ అరెస్ట్‌ చేసింది. ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయనీ, మరికొంత మందిని అరెస్ట్‌ చేయనున్నట్లు ఆ విభాగ అధికారులు పేర్కొన్నారు. ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వసంత, ఫార్మసిస్ట్‌ రాధిక, ఉద్యోగి నాగరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ హర్షవర్ధన్‌, ఎండీ శ్రీహరిలను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరందరినీ విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. తాజాగా జరిపిన ఏసీబీ సోదాల్లో అరవింద్‌ రెడ్డి కార్యాలయంలో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. సాక్ష్యాలు మొత్తం నిందితుల ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. నిందితులు ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొంత మందిని ఏసీబీ అదుపులోకి తీసుకోనుందని తెలుస్తోంది.

Other News

Comments are closed.