బీజేపీ ఉచ్చులో పడను: రజినీకాంత్‌

share on facebook

చెన్నై,నవంబర్‌8 (జనంసాక్షి) : బీజేపీతో రజినీకాంత్‌ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా సోషల్‌ విూడియాలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రజినీకాంత్‌.. బీజేపీ ట్రాప్‌లో తాను పడనంటూ కుండబద్ధలు కొట్టారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రజినీ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణం అయిన రజినీకాంత్‌ను తిరువళ్లవర్‌ విగ్రహ వివాదంపై స్పందించాలని విూడియా కోరింది.  ఘటనపై ఆయన మాట్లాడుతూ.. నాకు కాషాయ రంగు పులమాలని
బీజేపీ చూస్తోంది. ఈ విధంగానే తిరువళ్లువర్‌కు కూడా కాషాయరంగు వేయాలని చూస్తున్నారు. నేను బీజేపీ వ్యక్తిని కాదు. నాకు కాషాయ రంగు పులమకండి. తిరువళ్లువర్‌ లాంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయకండి. అనవసర వివాదానికి తెరలేపకండి… అని వ్యాఖ్యానించారు. తంజావూరులో ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్‌ విగ్రహానికి హిందూ మక్కల్‌ కట్చి నేత అర్జున్‌ సంపత్‌ కాషాయవస్త్రం కట్టి మెడలో రుద్రాక్ష మాలను వేసి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తమిళనాట పెనుదుమారం రేగింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటన బీజేపీ ప్రోద్బలంతోనే జరిగిందన్న రీతిలో రజినీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానంటూ రజినీ గతంలో చేసిన ప్రకటనలతో ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారన్న ఊహాగానాలు తెరపైకొచ్చాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ పుకార్లేనని స్పష్టం చేశాయి. అయోధ్య కేసులో కోర్టు తీర్పుపై ఆయన స్పందిస్తూ.. తీర్పు ఎలా వచ్చినప్పటికీ ప్రజలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.

Other News

Comments are closed.