‘మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర’: నిజమా? కల్పితమా?

share on facebook

బీబీసీ విశ్లేషణాత్మక కథనం

ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారని పుణె పోలీసులు ఆరోపించారు.

అందుకు ఆధారంగా తమ సోదాల్లో లభించినట్లు చెప్తున్న ఒక ఈ-మెయిల్ లేఖను కోర్టుకు సమర్పించారు.

సోదాల్లో లభించిన మరొక లేఖలో.. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ (ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు), విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావుల మద్దతు, మార్గదర్శకత్వాలలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దాడులు చేసినట్లు ఉందని చెప్తున్నారు.

”ఇంకా పెద్ద చర్యలు చేపట్టటం కోసం ‘జంగల్ కామ్రేడ్ల’కు ప్రణాళికను అందించే బాధ్యతను, తదుపరి చర్యలు చేపట్టటం కోసం వరవరరావు సమకూర్చిన నిధులను అందించే బాధ్యతను సురేంద్ర గాడ్లింగ్‌కు” ఇచ్చినట్లు ఆ ‘లేఖ’లో ఉంది.

భీమా-కోరెగావ్ హింసకు కారకులని, మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ.. బుధవారం (జూన్ 6) అరెస్ట్ చేసిన ఐదుగురిలో ఒకరైన రోనా విల్సన్ తదితరుల ల్యాప్‌ట్యాప్‌, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఈ ఆ లేఖలు లభించినట్లు పుణె పోలీసులు గురువారం కోర్టుకు చెప్పారు.

ఆ లేఖల కాపీలు అంటూ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కొన్ని ప్రచారంలో ఉన్నాయి.

ముఖ్యంగా ”మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర” అంశం జాతీయ మీడియాలో సంచలనం రేకెత్తించింది. కొన్ని చానళ్లు ఆ ”లేఖల”ను ఉటంకిస్తూ చర్చలూ నిర్వహించాయి.

అయితే.. ఆ లేఖలు, అందులోని అంశాలు అన్నీ పోలీసుల సృష్టేనని విప్లవ రచయితల సంఘం ఆరోపిస్తోంది.

మావోయిస్టులు అటువంటి లేఖలు రాయరన్న విషయం మీడియా సహా చాలా మందికి తెలుసునని వరవరరావు పేర్కొన్నారు.

మరోవైపు, ఈ లేఖలపై పోలీస్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారులు, సీనియర్ పాత్రికేయులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అడవిలోని మావోయిస్టు నాయకులు బయట ఉన్న వారికి అటువంటి రాశారనటం విడ్డూరంగా ఉందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంతకీ ఈ ‘లేఖలు’ ఎక్కడివి?

ఈ ఏడాది జనవరి 1న మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల భీమా-కోరెగావ్‌లో.. ”పీష్వాలపై దళితుల విజయం” 200వ వార్షికోత్సవ నిర్వహణ సందర్భంగా హింస చెలరేగింది.

ఆ హింసలో ఒక వ్యక్తి చనిపోగా, పోలీసులు సహా పలువురు గాయపడ్డారు.

తొలుత.. ఆ హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై హిందూ సంస్థల ప్రతినిధులు శంభాజీ భిడే, మిలింద్ ఏక్బోటేలపై కేసు నమోదు చేశారు.

వీరిలో మిలింద్ ఏక్బోటేను అరెస్ట్ చేయగా ఆయన బెయిల్‌ మీద విడుదలయ్యారు. శంభాజీ భిడేను అరెస్ట్ చేయలేదు.

అయితే తాజాగా.. ఆ హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై రిపబ్లికన్ పాంథర్స్ జాతి అంతాచీ చల్వల్ (ఆర్‌పీ) నేత సుధీర్ ధవలే, నాగ్‌పూర్‌కి చెందిన హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, దిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్‌లతో పాటు.. నాగ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సోమా సేన్, పీఎంఆర్‌డీ మాజీ పరిశోధకుడు మహేశ్ రావుత్‌లను ముంబై, నాగ్‌పూర్, దిల్లీలలో పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.

వీరందరూ పట్టణాల్లో అగ్ర స్థాయి మావోయిస్టులని ఆరోపించారు.

ఏప్రిల్ 17వ తేదీన దిల్లీ, ముంబై, నాగ్‌పూర్‌లలో.. రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధవలేలతో పాటు, మావోయిస్టు మద్దతుదారులుగా అనుమానిస్తున్న హర్షాలీ పోద్దార్ తదితర నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించామని పుణె పోలీసులు చెప్పారు.

ఆ సోదాల్లో కొన్ని ఎలక్ట్రానిక్ స్టోరేజీ పరికరాలు, సీడీలు, కొన్ని ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నామని.. వాటిని పుణె ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించి.. వాటి నుంచి మిర్రర్ ఇమేజీలను సేకరించామని పేర్కొన్నారు. ఆ ప్రింటవుట్లను పరిశీలించగా.. రాజీవ్‌గాంధీ హత్య తరహాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేయటానికి నక్సలైట్లు కుట్ర పన్నిన విషయం వెల్లడైందని తెలిపారు.

ఈ సాక్ష్యాల ఆధారంగా పై ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరిని పుణె సెషన్స్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 14వ తేదీ వరకూ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.

‘మోదీ హత్యకు కుట్ర లేఖ’లో ఏముంది?

పోలీసు సోదాల్లో దొరికినట్లు చెప్తున్న ఆ లేఖను ఏఎన్ఐ వార్తా సంస్థ విడుదల చేసింది. ‘కామ్రేడ్ ప్రకాశ్’ అనే వ్యక్తికి ఇంగ్లిష్ ”R” అక్షరంతో సంతకం చేసిన వ్యక్తి రాసినట్లుగా ఇంగ్లిష్‌లో టైప్ చేసి ఉందా లేఖ.

ఆ అక్షరానికి అర్థం ‘రోనా విల్సన్’ అని.. ‘కామ్రేడ్ ప్రకాశ్’ అంటే ప్రకాశ్ అంబేడ్కర్ అని తాము భావిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీల విడుదల కోసం శాయశక్తులా కృషి చేస్తున్నామని ఆ లేఖ ఆరంభంలో ఉంది.

అలాగే.. ఎం4 తుపాకీలు, నాలుగు లక్షల తూటాలు సరఫరా కోసం రూ. 8 కోట్లు అవసరమని కూడా ఆ లేఖలో రాసివుంది.

రెండో పేరాలో ”మోదీ సారథ్యంలోని హిందూ ఫాసిస్టు పాలన ఆదివాసీల జీవితాలను ధ్వంసం చేస్తోంది. బిహార్, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా ఓడిపోయినప్పటికీ మోదీ 15 పైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయగలిగారు. ఇదే వేగం కొనసాగినట్లయితే అది పార్టీకి అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. అసమ్మతిని ఇంకా ఎక్కువగా అణచివేయటం, మిషన్ 2016 (ఓజీహెచ్ – ఆపరేషన్ గ్రీన్ హంట్) మరింత కిరాతకంగా అమలు చేస్తారు. మోదీ-రాజ్‌ను అంతం చేయటానికి కామ్రేడ్ కిసన్, మరికొందరు సీనియర్ కామ్రేడ్లు నిర్దిష్టమైన చర్యలను ప్రతిపాదించారు. మరో రాజీవ్‌గాంధీ సంఘటన తరహాలో మేం ఆలోచిస్తున్నాం. ఇది ఆత్మహత్యాసదృశంగా వినిపిస్తుంది, మనం విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. కానీ మన ప్రతిపాదన మీద పార్టీ పీబీ/సీసీ చర్చించి తీరాలని మేం భావిస్తున్నాం. ఆయన రోడ్-షోలను లక్ష్యంగా చేసుకోవటం సమర్థవంతమైన వ్యూహం కావచ్చు” అని టైప్ చేసి ఉంది.

వరవరరావు పాత్రపై లేఖలో ఏముంది?

పుణె పోలీసుల సోదాలో లభించినట్లు చెప్తున్న లేఖల్లో ఒకటి హిందీలో టైప్ చేసి ఉంది.

‘కామ్రేడ్ మిలింద్’ రాసినట్లు కింద టైప్ చేసివున్న ఆ లేఖను ఎవరికి రాశారనేది అందులో లేదు. జీన్యూస్ వెబ్‌సైట్‌లో ఆ లేఖ కాపీని ప్రచురించారు.

”మన సీనియర్ కామ్రేడ్ వరవరరావు, మన న్యాయ మద్దతుదారు సురేంద్ర గాడ్గిల్‌లు ఇచ్చిన మార్గదర్శకత్వంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా డిసెంబర్‌లో గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లలో చేపట్టిన చర్యలు.. కామ్రేడ్లు తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా సూర్జాగఢ్‌లో చేసిన దాడుల వల్ల మనకు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది” అని అందులో రాసి ఉంది.

”ప్రచార మాధ్యమాలు, శత్రువుల ద్వారా.. మన సంఖ్య 500 అని తెలపటం ద్వారా మన ప్రతిష్ఠ పెరిగింది. రానున్న రోజుల్లో చేపట్టబోయే కొన్ని పెద్ద చర్యల విషయంలో కామ్రేడ్ వరవరావు, కామ్రేడ్ సురేంద్రలు వాటిని విజయవంతం చేయటం కోసం అడవిలో ఉన్న కామ్రేడ్లకు పథకాలు రచించి పంపిస్తారు” అని పేర్కొని ఉంది.

”ఇలాంటి పెద్ద పనులు చేసే బాధ్యతను సురేంద్రకు అప్పజెప్పాం. ఆయనకు కామ్రేడ్ వరవరరావు నిధులు అందజేశారు. వాటిలోంచి కొంత భాగం సురేంద్ర మీకు పంపిస్తారు. మీరు ఆయనతో టచ్‌లో ఉంటూ చర్యలు నిర్వహించండి” అని ఆ లేఖలో రాసివుంది.

మరో లేఖలో ‘‘కాంగ్రెస్‌లోని మిత్రులతో చర్చలు’’

సోదాలో లభించినట్లు చెప్తున్న ఇంకొక లేఖ.. ‘కామ్రేడ్ రోనా’కు ‘కామ్రేడ్ M’ అనే వ్యక్తి రాసినట్లు ఉంది.

మావోయిస్టు పార్టీ అగ్ర నేత మిలింద్ తేల్‌తుంబ్డే ఈ లేఖ రాసినట్లు పోలీసులు చెప్తున్నారు.

అయితే ఈ లేఖ టైప్ మిషన్ మీద టైప్ చేసినట్లు ఉండటం విశేషం.

రోనా విల్సన్ సహా పుణె పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి పేర్లూ ఈ లేఖలో ఉన్నాయి.

‘లాల్ జోహార్’ అనే నినాదంతో మొదలైన ఆ లేఖలో ”భీమా-కోరెగావ్ కార్యక్రమాన్ని కామ్రేడ్ మంగ్లు, కామ్రేడ్ దీపులు గత రెండు నెలలుగా కామ్రేడ్ సుధీర్‌తో సమన్వయం చేస్తున్నార”ని రాసివుంది.

”కామ్రేడ్ జిగ్నేష్, కామ్రేడ్ ఉమర్‌లు మన విప్లవానికి యువ యోధులు” అని, ”ప్రకాశ్ అంబేడ్కర్‌ నుంచి బలమైన మద్దతు ఉంది” అని ఉంది.

అలాగే.. ”సీపీఐ (మావోయిస్టు)కు చెందిన పట్టణ నాయకత్వంలోని సీనియర్ కామ్రేడ్లు.. కాంగ్రెస్ లోని మన మిత్రులతో చర్చలు జరిపారు. దళితులను కూడగట్టటం మరింత తీవ్రంగా కొనసాగించాలని.. అందుకు అవసరమైన న్యాయ, ఆర్థిక సహాయాన్ని మధ్యవర్తి జిగ్నేశ్ ద్వారా అందించటానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు” అని ఆ లేఖలో రాసివుంది.

ఇంకా.. ”కామ్రేడ్ కోబడ్, కామ్రేడ్ సాయిలు సహా సీనియర్ రాజకీయ ఖైదీలను విడుదల కోసం సహాయం చేస్తామని కాంగ్రెస్ మిత్రులు హామీ ఇచ్చారు. బ్రదర్ ఆనంద్‌తో మాట్లాడండి.. కామ్రేడ్ మనోజ్ ద్వారా రిపోర్టులు పంపించాలని ఆయనకు సమాచారం ఇవ్వండి” అని కూడా ఆ లేఖలో ఉంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారనేందుకు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పత్రికా సమావేశంలో ప్రకటించారు.

తననూ, తన కుటుంబాన్ని బెదిరిస్తూ మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చాయని కూడా ఆయన చెప్పారు.

వారం కిందట ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఆ లేఖలను పోలీసులకు అప్పగించినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి.

ఫడ్నవిస్ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. నక్సలైట్లు గతంలో గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యారని.. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

పడిపోతున్న మోదీ ఇమేజ్ పెంచే పథకం: వరవరరావు

“ఈ లేఖలు చూస్తే.. అందులోని భాష, శైలిని చూస్తే అవి మావోయిస్టు పార్టీ రాసినవి కావనేది స్పష్టమవుతోంది. నరేంద్రమోదీ పొలిటకల్ గ్రాఫ్ పడిపోతుండటంతో.. ఆయన ఇమేజ్‌ పెంచటం కోసం ఈ పథకం వేసినట్లు అర్థమవుతుంది” అని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బీబీసీతో అన్నారు.

పోలీసుల సోదాల్లో బయటపడ్డట్లు చెప్తున్న మూడు లేఖల్లో వేర్వేరు అంశాలు ఉన్నాయి. అందులో చాలా తీవ్రమైనది ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినట్లుగా చెప్తున్న లేఖ.

వేరొక లేఖలో మావోయిస్టుల దాడుల కోసం సీనియర్ కామ్రేడ్ వరవరరావు.. న్యాయవాది సురేంద్ర గాడ్గిల్‌కు నిధులు సమకూర్చారని ఉంది.

ఇంకొక లేఖలో జిగ్నేశ్ మేవానీ నుంచి కాంగ్రెస్ నాయకుల వరకూ ప్రస్తావన ఉంది.

”నిజానికి పోలీసులు సోదా చేసిన నెల రోజుల తర్వాత, రోనా విల్సన్ తదితరులను అరెస్ట్ చేసిన మూడు రోజుల తర్వాత ఈ లేఖలు తమకు దొరికాయంటూ మీడియాకు లీక్ చేశారు. ఈ లేఖలే కల్పితం కాగా, మీడియా ఈ మూడింటినీ కలిపి చూపుతోంది” అని వరవరరావు బీబీసీతో చెప్పారు.

భీమా-కోరేగావ్ హింసకు కారకులైన శంభాజీ భీడే, మిలింద్ ఏక్బోటేల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్ర పోలీసులు ఇలా చేశారని ఆయన ఆరోపించారు.

”శంభాజీ భీడేని మోదీ గురువుగా భావిస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు.

”మక్కా మసీదులో పేలుడు జరిగితే ముస్లింలు చనిపోతారు. ఆ తర్వాత ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపితే ముస్లింలు చనిపోతారు. ఆ పేలుడుకు కారణమని ముస్లింల పైనే కేసులు పెట్టి వేధిస్తారు. హిందుత్వ సంస్థల వారిని మాత్రం నిర్దోషులుగా విడుదల చేస్తారు. కోరేగావ్ పరిస్థితి కూడా అలాగే అవుతోంది” అని వరవరరావు ఆరోపించారు.

దళితులు అస్తిత్వం, ఆత్మగౌరవాల పోరాటంతో పాటు భూమి కోసం డిమాండ్ చేస్తుండటంతో.. వారి వెనుక మావోయిస్టులు ఉన్నారని మోదీ సర్కారు భావిస్తున్నట్లుగా ఉందన్నారు.

”నయీ పీష్వాయీ నహీ చలేగీ’ నినాదం ఇచ్చిన సుధీర్ ధవలే మొదలుకుని.. ప్రకాశ్ అంబేడ్కర్, జిగ్నేశ్ మేవానీ, ఉమర్ ఖాలిద్‌లతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు మావోయిస్టులతో చేతులు కలిపారని ఆ లేఖల్లో రాసుకొచ్చారు. ఇదంతా కల్పితం” అంటూ తోసిపుచ్చారు.

‘‘అసలు మావోయిస్టులు లేఖల్లో తమ పేర్లు ప్రస్తావించరు’’

అయితే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నినట్లు పుణె పోలీసులు చేస్తున్న ఆరోపణలతో.. ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులు విభేదించినట్లు ‘ద టెలిగ్రాఫ్’ పత్రిక ఒక కథనంలో ఉటంకించింది.

”మావోయిస్టులు తమ సమాచార మార్పిడిలో (లేఖల్లో) అసలు పేర్లను ఉపయోగించినట్లు నా కెరీర్‌లో నేను ఎన్నడూ చూడలేదు. వాళ్లు మారు పేర్లను మాత్రమే ఉపయోగిస్తారు” అని ఝార్ఖండ్ మాజీ డీజీపీ జి.ఎస్.రథ్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది.

ఆయన 2000-2003 మధ్య మావోయిస్టుల మీద ఇంటెలిజెన్స్ వ్యవహారాలను పర్యవేక్షించారు.

”సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలటరీ కమిషన్, జోనల్ మిలటరీ కమిషన్ సభ్యులు గతంలో సమచార మార్పిడి కోసం ఇంటర్నెట్, ఈ-మెయిళ్లను ఉపయోగించేవారు. కానీ మేం ఈ-మెయిళ్లపై నిఘా పెట్టి కనుగొనటం మొదలుపెట్టాక వారు కోడ్ భాషకు మారారు” అని ఆయన చెప్పారు.

”కేవలం రాజకీయ ప్రచారం కోసమే చేతి రాత పత్రాలను ఉపయోగిస్తారు. …. ప్రధానమంత్రిని హత్య చేయాలన్న హెచ్చరిక ఒక సభ్యుడి అభిప్రాయం కావచ్చు.. కానీ దానికి పొలిట్‌బ్యూరో ఆమోదం కావాలి” అని ఆయన పేర్కొన్నారు.

ఆ లేఖలు కల్పితంలా కనిపిస్తున్నాయి: గుజరాత్ మాజీ అదనపు డీజీపీ

గుజరాత్ మాజీ అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) ఆర్.బి.శ్రీకుమార్.. ‘‘ఈ లేఖలను కృత్రిమంగా సృష్టించినట్లు కనిపిస్తున్నాయి. మావోయిస్టులు ఎన్నడూ అసలు పేర్లు వాడరు’’ అని అభిప్రాయపడినట్లు టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. ఆయన.. చట్టవిరుద్ధ హత్యలు, గుజరాత్ అల్లర్లపై వివిధ దర్యాప్తు సంఘాల ముందు సాక్ష్యం చెప్పారు.

”గుజరాత్‌లో ఇష్రత్ జహాన్ సహా 22 మందిని ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపారు. వాటిపై జస్టిస్ బేడీ కమిషన్ దర్యాప్తు చేసింది. ఆ కేసులన్నిటిలో వారందరూ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులనీ, వారు ముఖ్యమంత్రి మోదీని హత్య చేయటానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెప్పేవారు. మాజీ డీఐజీ వంజారాను అరెస్ట్ చేశాక ఆ హత్యలు ఆగిపోయాయి” అని శ్రీకుమార్ పేర్కొన్నారు.

”ఇదంతా చెత్త. ఇది వారి ఊహాకల్పన. పోలీసుల సామర్థ్యం ఏమిటో అందరికీ తెలుసు. ఈ లేఖ పూర్తిగా కల్పితం. మావోయిస్టు ఎవరూ ఇలాంటి అర్థంలేని లేఖలు రాసి పంపించరు. ఒక లేఖను కాపీ కొట్టే కనీస మెదడు కూడా వారికి లేదు” అని సీపీడీఆర్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ తేల్‌తుంబ్డే వ్యాఖ్యానించినట్లు ‘సకాల్‌టైమ్స్’ పత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆయన గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఆ కథనం ప్రకారం.. ”రోనా విల్సన్ సానుభూతిపరుడు కావచ్చు కానీ అతడికి పార్టీతో సంబంధం లేదు. మోదీని విమర్శిస్తున్నారు కాబట్టి జిగ్నేశ్ మేవానీని లక్ష్యంగా చేసుకున్నారు. ఇటువంటి రాజకీయాల వల్ల ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా సిగ్గుపడాలి” అని ఆనంద్ తేల్‌తుంబ్డే పేర్కొన్నారు.

”నక్సల్స్ మారుపేర్లు పెట్టుకుంటారు.. లేఖల్లో రాయరు…”

నక్సలైట్లు ‘లాల్ సలామ్’ అని అభినందనలు తెలుపుకుంటారని.. వీటిలోని ఒక లేఖలో పేర్కొన్నట్లు ‘లాల్ జోహార్’తో కాదని.. ఝార్ఖండ్, ఒడిశాలలో పదిహేనేళ్లుగా పనిచేస్తున్న గిరిజన హక్కుల కార్యకర్త గ్లాడ్సన్ డుంగ్, డుంగ్ చెప్పినట్లు సకాల్‌టైమ్స్ కథనం తెలిపింది.

ఆయన నక్సలిజానికి సంబంధించి.. ‘ఎండ్‌లెస్ క్రై ఇన్ రెడ్ కారిడార్, మిషన్ సరండా’ అనే రెండు పుస్తకాలు రాశారు.

”ఈ లేఖలు బూటకమని నేను ఖచ్చితంగా చెప్పగలను. నక్సలైట్లు ఎప్పుడూ అటువంటి లేఖలు రాయరు. తమ శ్రేణుల్లోని వారి పేర్లు కానీ, తమ ఆపరేషన్ల వివరాల గురించి ఎన్నడూ లేఖల్లో ప్రస్తావించరు. మావోయిస్టులు తమ పేర్లను ఎప్పుడూ బయటపెట్టరు. వాళ్లు పేర్లు మార్చుకుంటూ ఉంటారు. రాసేటపుడు కల్పితమైన పేర్లు రాస్తారు” అని ఆయన చెప్పారు.

”మావోయిస్టులు గతంలో అరుంధతీ రాయ్‌ని దంతెవాడ అడవిలోకి పిలిచినపుడు.. ఆ లేఖలో కనీసం ఆమె పేరును కూడా ప్రస్తావించలేదు. మీరు ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఒక వ్యక్తిని కలుస్తారు అని చెప్పారు. ఆమె చేతిలో కొబ్బరికాయతో, నుదుటి మీద తిలకంతో రావాలని.. ఆమెను తీసుకెళ్లే వ్యక్తి చేతిలో ఒక అరటిపండు, ఔట్‌లుక్ మేగజీన్ కాపీ ఉంటుందని.. ఆమెను నమస్కార్ గురూజీ అని పలకరిస్తారని మాత్రమే రాశారు” అని ఆయన ఉదహరించారు.

పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురి తరఫు న్యాయవాది సుజాన్ అబ్రహాం.. ”ఇదంతా కల్పితం. అరెస్టైన వ్యక్తులు ఖండించిన ఒక లేఖ ప్రాతిపదికగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఆ లేఖలను మాకు ఇవ్వను కూడా లేదు. కట్టుకథలు అల్లుతున్నారు” అని ఆరోపించారు.

మావోయిస్టుల నుంచి నాకూ బెదిరింపు లేఖలు వచ్చాయి: ఫడ్నవిస్

Other News

Comments are closed.