విచారణకు హాజరైన ప్రజ్ఞా సింగ్‌!

share on facebook

ముంబయి, జూన్‌7(జ‌నంసాక్షి) : మహారాష్ట్రలోని మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఆమె ఈ వారంలో విచారణకు హాజరు కాకపోవడంతో… తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గురువారం న్యాయస్థానం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరయ్యారు. గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆమె అధిక రక్త పోటుతో బాధపడుతున్నారని, ప్రయాణం చేసే స్థితిలో లేరని ఆమె తరఫు న్యాయవాది ప్రశాంత్‌.. న్యాయస్థానానికి తెలిపారు. అయితే, గురువారం నాటి విచారణకు ప్రజ్ఞాకు న్యాయస్థానం మినహాయింపు ఇస్తూనే న్యాయస్థానం ఓ హెచ్చరిక చేసింది. శుక్రవారం ఆమె విచారణకు హాజరుకావాలని లేదంటే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎన్‌ఐఏ న్యాయస్థానం న్యాయమూర్తి వి.ఎస్‌. పదాల్కర్‌ హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితం ఆమె న్యాయస్థానానికి ఓ విన్నతి చేసుకున్నారు. జూన్‌ 3 నుంచి 7 మధ్య న్యాయస్థానంలో కొనసాగే విచారణకు తాను హాజరుకాలేనని, విచారణలో తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే, ఆమె విన్నపాన్ని తిరస్కరించిన న్యాయమూర్తి ఈ కేసులో ఆమె వారానికి ఓసారి తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలోని మాలెగావ్‌లో 2008 సెప్టెంబర్‌ 29న మోటార్‌బైక్‌లో పెట్టిన బాంబుపేలి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, చాలా మందికి తీవ్రగాయలయ్యాయి. ఈ కేసులో ప్రజ్ఞా ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఇటీవల ఆమె మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలిచిన విషయం తెలిసిందే.

Other News

Comments are closed.