17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు
18 జిల్లాల్లో 35 కేంద్రాల ఏర్పాటు
ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం
హైదరాబాద్,మే22(జనంసాక్షి): తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 జిల్లాల్లో 35 కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండగా.. ఉదయం 5.30 గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్రాల్లో ఉండాలని అధికారులు సూచించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా..110సెగ్మెంట్లలో లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుచేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మేడ్చల్, ఎల్‌బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో 28 టేబుళ్ల చొప్పున కేటాయించారు. కాగా, అన్నిచోట్లా పర్యవేక్షణ కోసం అదనంగా ఒక టేబుల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో 500కుపై గా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ 30 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేసే అవకాశం ఉంది. ముందుగా ఈవీఎంల తాళాలు తీసి, లెక్కించిన అనంతరం చివరగా ర్యాండమ్ పద్ధతిలో అదే వీవీప్యాట్లను లెక్కిస్తారు. ఈవీఎం ల్లో పోలైన ఓట్లతో పోల్చుకుని సరిచూసుకున్న తర్వాతనే విజేతలను అధికారికంగా ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపునకు ఒక్కోరౌండ్‌కు 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే మరింత సమయం పడుతుందని ఈసీ అధికారులు చెప్తున్నారు. లెక్కింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల సవిూపంలో సాయంత్రం నుంచే 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు.