అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
భక్తులను అలరింపజేసిన నందికొల్ల సేవ
భక్తులతో కిక్కిరిసి పోయిన ఆలయం
ఇటిక్యాల (జనంసాక్షి) మార్చి 30 :మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణా నది తీరాన వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా వేద పండితులు దత్తుస్వామి, వెంకటస్వామి తదితర అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం, నంది కోళ్ల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, కొండపేట, యాక్తాపురం, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, జింకలపల్లి, కొండేరు, కోదండాపురం, సాసనూలు, దువాసిపల్లి, బి. వీరాపురం, కారుపాకుల, ఆర్.గార్లపాడు పెద్దదిన్నె, పుటాన్ దొడ్డి, ధర్మవరం, వల్లూరు, షాబాద్, కాక పెబ్బేరు,వనపర్తి, గద్వాల, కొత్తకోట, కర్నూలు తదితర ప్రాంతాల నుండి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. దక్షిణ వాహిని అయినా పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని కన్నుల పండగగా తిలకించారు. అలాగే సీతారాముల కళ్యాణం జరిపించేందుకు ఆలయ పాలక మండలి పట్టు వస్త్రాలను సమర్పించారు. అదే విధంగా సాయంత్రం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు. అలాగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో బీచుపల్లి పదవ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సాంబశివరావు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జోగులాంబ ఆలయ కమిటీ డైరెక్టర్ నాగబలిమి, స్థానిక సర్పంచ్ నరసమ్మ తోపాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. మండల కేంద్రంతో పాటు ఆర్. గార్లపాడు పుటాన్ దొడ్డి, ధర్మవరం, వల్లూరు, వావిలాల గ్రామాల్లో కూడ సీతారాముల కళ్యాణం స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు