అమరజీవి మీకు ..మాకు కాదు

శ్రీపొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ఆంధ్ర రాష్ట్రం కోసమే.. ఆంధ్రప్రదేశ్‌ కోసం కాదు
ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు.. ఆయనకు సంబంధమే లేదు..
ఆయన మృతికి సంతాపం తెలిపింది హైదరాబాద్‌ రాష్ట్రం
హైదరాబాద్‌ రాష్ట్రానికి శ్రీరాములు చేసిందేమీ లేదు..
ఆంధ్రుల పత్రిక ‘ఆంధ్రపత్రిక’ వార్తలే దీనికి సాక్ష్యం

హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) :
మాటిమాటికీ తెలుగు రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశారని, ఆయన అమరజీవని ఆంధ్రులు చెబుతుంటారు. ఇదే పాఠ్య పుస్తకాల్లో, వాళ్ల చేత నడిపించబడుతున్న పత్రికల్లో ప్రస్తావిస్తూ యాభై ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలతో అనిపిస్తున్నారు. అసలు తెలంగాణకు పొట్టి శ్రీరాములుకు ఏ మాత్రం సంబంధం లేదు. ఆయన అమరజీవి కావచ్చు గాక, కానీ, అది ఆంధ్రులకు మాత్రమే. తెలంగాణకు మాత్రం కాదు. శ్రీరాములు కోరుకున్నది ఆంధ్రప్రదేశ్‌ కాదు, ఆయన దీక్ష చేసింది కూడా ఆంధ్రప్రదేశ్‌ కోసం. ఆంధ్రులు చెబుతున్నట్లు ఆయన ఆమరణ దీక్షకు కూర్చున్నది తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం కావాలని కాదు. ఆంధ్రులకు ఓ రాష్ట్రం కావాలని. అది మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్న ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని. వీటికి సాక్ష్యం ఆంధ్రల కోసం, ఆంధ్రుల చేత నడిపించబడ్డ ‘ఆంధ్రపత్రిక’లో నాడు ప్రచురితమైన వార్తలే సజీవ సాక్ష్యాలు
– శ్రీరాములు దీక్ష, ఆంధ్ర రాష్ట్ర అవతరణ..
– పొట్టి శ్రీరాములు తన దీక్షను అక్టోబర్‌ 19, 1952లో ప్రారంభించారు.
– ఈ దీక్ష 15 డిసెంబర్‌ 1952 వరకు కొనసాగింది.
– అదే రోజు అంటే, 15 డిసెంబర్‌ 1952 రాత్రి పొట్టి శ్రీరాములు మృతి చెందారు.
– దీంతో కేంద్రం దిగి వచ్చింది. పొట్టి శ్రీరాములు మృతికి సంతాపం తెలిపింది.ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
– ఫలితంగా, అక్టోబర్‌ 1, 1953 ఆంధ్రరాష్ట్ర అవతరణ జరిగింది.
– ఈ ‘అవతరణానికి’ తెలంగాణకు ఏ మాత్రం సంబంధం లేదు.
– పొట్టి శ్రీరాములు మృతి చెందిన విషయం తెలిశాక, ఆయన మృతికి హైదరాబాద్‌ రాష్ట్ర శాసనసభ సంతాపం తెలిపింది. ఈ విషయాన్ని నాటి ఆంధ్ర పత్రికలోనే ప్రచురితమైంది.

– ఆంధ్రులు నడిపించిన ఈ ‘ఆంధ్రపత్రిక’లోని వార్తే తెలంగాణకు, పొట్టి శ్రీరాములుకు ఎటువంటి సంబంధం లేదని నిరూపిస్తుంది.
– అంటే, అప్పటికీ హైదరాబాద్‌ సమేత రాష్ట్రం ఏర్పాటు కాలేదన్నది సుస్పష్టం.
– మరి నేడు హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఒకటి పెట్టి, ఆయనేదో ఆంధ్రప్రదేశ్‌ కోసం రాష్ట్రం దీక్ష చేసి మృతి చెందినట్లు కట్టు కథలు చెబుతున్న ఆంధ్రులది కుట్రే కదా !
– తెలంగాణ ప్రజలను బలవంతంగా పొట్టి శ్రీరాములు అందరి కోసం చనిపోయినట్లు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నట్టే కదా !
– నేడు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమం హింసాత్మకంగా సాగుతున్నదని సీమాంధ్రులు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
– కానీ, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు త్యాగాలనే చేస్తున్నారు గానీ, ఎక్కడా ప్రజలను వేధించడం లేదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం లేదు.
– కానీ, పొట్టి శ్రీరాములు మృతి తర్వాత అనేక హింసాత్మక సంఘటలు జరిగాయి. దీనికి కూడా ‘ఆంధ్రపత్రికే’ సాక్ష్యం.
– ‘వాల్తేరు స్టేషన్‌ మీద దాడి’ అని పొట్టి శ్రీరాములు చనిపోయిన రెండు రోజులకు అంటే డిసెంబర్‌ 17, 1952లో ఓ వార్త ప్రచురితమైంది. ఇదే ‘జై ఆంధ్ర’ ఉద్యమం హింసాత్మకంగా సాగిందనడానికి సాక్ష్యం. ‘కొందరు ఆవేశపరులు రెండు రైల్వే క్యాబిన్ల మీద దాడి చేసి, ఉత్తరాన ఉన్న క్యాబిన్‌ తలుపు తీసి టెలిఫోన్‌, టెలిగ్రాఫ్‌ తీగలు, తెంచివేశారు. రైల్వే పాయింట్లన్నీ పాడు చేశారు’ అన్నది ఆ వార్త సారాంశం.
– అప్పట్లో సాగిన ‘జై ఆంధ్ర’ ఉద్యమమే హింసాత్మకంగా సాగిందనడానికి అప్పట్లో అదే ఆంధ్రపత్రిక ‘ఇది ఏ నాగరిక పద్ధతి’ అంటూ సంపాదకీయాన్నే ప్రచురించింది.
అందుకే, చెప్పొచ్చేదేమంటే.. తెలంగాణ ఉద్యమం హింసాతక్మకంగా సాగడం లేదు. తెలంగాణవాదులు త్యాగాలు చేస్తున్నారే గానీ, త్యాగాలను కోరుకోవడం లేదు. పొట్టి శ్రీరాములు చనిపోయింది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసమే గానీ, తెలంగాణ కోసం కాదు. ఆయనకు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన చనిపోయాక ఏర్పడ్డది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్‌ కాదు. పొట్టి శ్రీరాములు మృతి చెందాక, నాలుగేళ్ల తర్వాత, సీమాంధ్రులు తమ ‘డేరానగర్‌’ను కుట్రలతో హైదరాబాద్‌కు షిఫ్ట్‌ చేశారు. ఇది సత్యం. తెలంగాణ ప్రజలు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తిస్తారు. కానీ, ఆయన జయంతి, వర్ధంతులను జరుపుకోరు. ఆ అవసరం ‘తెలంగాణ’కు లేదు.