అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలి

నరసరావుపేట: రాష్ట్ర కేబినెట్‌ మొత్తం కళంకితమేనని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తక్షణం తొలగించాలని మాజీ మంత్రి తెదేపా నేత కోడెల శివప్రసాదరావు డిమాండ్‌ చేశారు. అవినీతి ఆరోపణలు భూదందాలు చేస్తూ కేసులు నమోదైన మంత్రులను తొలగించడంలో సి.ఎం. తాత్సారం చేస్తున్నారని కోడెల విమర్శించారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన మంత్రులకు ప్రభుత్వం న్యాయసహాయం అందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్ల అక్రమాలకు పాల్పడి జైలులో ఉన్న జగన్‌కు, మరో మంత్రి మోపిదేవికి ప్రభుత్వం న్యాయసహాయం అందించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తెదేపా హయాంలో చిన్న ఆరోపణ వస్తే మంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు ఉన్నాయని చెప్పారు. బందిపోట్లులా దేశాన్ని లూటీ చేస్తున్నారని, దుర్మార్గం ఆపకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.