ఆయన ఫొటో వాడొద్దు : విహెచ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 2 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులున్నారు.. ఎవరనేది చెప్పాల్సిన పనిలేదని రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ ధర్మాన కమిటీ సూచన మేరకు వైఎస్‌ఆర్‌ ఫొటో ఎక్కడా వాడొద్దని పార్టీ శ్రేణులను కోరుతున్నానన్నారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు. సిఎం కిరణ్‌ నివాసంలో వైఎస్‌ఆర్‌ ఫొటో ఉందని.. దానిని ఆయన తొలగిస్తే మంచిదన్నారు. లేకుంటే కార్యకర్తలే తొలగిస్తారని స్పష్టం చేశారు. యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని అప్రదిష్ట పాల్జేసేందుకు కొందరు పావులు కదుపుతున్నారని, వాటిని అడ్డుకుంటామని చెప్పారు. వైఎస్‌ ఫొటో విషయంపై రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు మొసలి కన్నీరు కారుస్తున్నా రన్నారు. వైఎస్‌ఆర్‌ ఫొటోపై వివాదం రేకెత్తించడంలోనే కెవిపి తన నిజస్వరూపాన్ని బయట పెట్టారని అన్నారు. వైఎస్‌ఆర్‌ను అడ్డుపెట్టుకుని జగన్‌ ఎంత సంపాదించారో.. కెవిపి రామచంద్రరావు కూడా అదే స్థాయిలో సొమ్ము దండుకున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ను చంపించింది సోనియా గాంధీయేనని వైఎస్‌ విజయమ్మ ఆరోపణలు చేసిన సమయంలో కెవిపికి చెవులు పనిచేయలేదా అని నిలదీస్తున్నానన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని పార్టీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, వారే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు.