ఆర్టీఎస్‌ వద్ద 9న కాంగ్రెస్‌ మహాధర్నా

Mohammed-Ali-Shabbir-Pardaphash-107595కాంగ్రెస్‌ను దెబ్బతీయడం కెసిఆర్‌ తరం కాదు: షబ్బీర్‌ అలీ
హైదరాబాద్‌,మే7(జ‌నంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని పాతరేయడం కేసీఆర్‌, కేటీఆర్‌ తరం కాదని, ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కేటీఆర్‌ అహంకారంతో ఉలికిపడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెబుతున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ హయాంలో చేపట్టినవేనని షబ్బీర్‌ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్‌ సహకరిస్తూనే ఉందని, అయితే చిత్తశుద్ధి లేదని కేసీఆర్‌కేనని ఆయన ధ్వజమెత్తారు. రీ డిజైన్‌ పేరుతో కేసీఆర్‌ చేస్తున్న అవినీతినే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అయినా దానిని పట్టించుకోవడం లేదని  షబ్బీర్‌అలీ అన్నారు. ఈ విషయంలో అఖిలపక్ష సమావేశం పెట్టి సీఎం కేసీఆర్‌ చర్చిస్తారని ఆశించామని తెలిపారు. కరువుపై కేసీఆర్‌ దృష్టిపెట్టకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజోలిబండ వివాదాన్ని పరిష్కరించాలని త్వరలో కర్ణాటక సీఎంను కలవబోతున్నామన్న షబ్బీర్‌ తమ బాధ్యతగా కర్ణాటక సీఎంతో మాట్లాడేందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విషయంలో ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తామని షబ్బీర్‌అలీ వెల్లడించారు.ఆర్డీఎస్‌ ప్రాజెకట్‌ను  పూర్తి చేయాలనే డిమాండ్తో ఈ నెల 9న ఆర్డీఎస్‌ ప్రాజెక్ట్‌ వద్ద కాంగ్రెస్‌ మహాదీక్ష చేపడుతున్నట్లు షబ్బీర్‌ అలీ వెల్లడించారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి ఆర్డీఎస్‌ పనులు పూర్తి చేయాలని, తెలంగాణకు 3 టీఎంసీల సాగునీరు ఇవ్వాలని కోరతామన్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పూర్తిగా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్‌ డిమాండ్‌ చేశారు. వర్షాలవల్ల జరిగిన పంట నష్టానికి రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఈదురు గాలులతో కురిసే వానల ధాటికి జీహెచ్‌ఎంసీ పరిధితోసహా అన్ని కార్పొరేషన్ల పరిధుల్లో వేల చెట్లు విరిగి ట్రాఫిక్‌కు అంతరాయాలు ఏర్పడుతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలవల్ల తలెత్తిన పరిస్థితులను వెంటనే సవిూక్షించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.