.ఇంత దారుణమా..
` మీకన్నా బ్రిటీషర్లే నయం
` యూపీలో రైతులపైదాడిపై మండిపడ్డ విపక్షాలు
` భాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకాగాంధీ అరెస్టు
` న్యాయంకోసం జరుగుతున్న అహింసాపోరులో రైతులను గెలిపిస్తాం: రాహుల్
లఖ్‌నవూ,అక్టోబరు 4(జనంసాక్షి):ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను యూపీ పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌నూ సోమవారం లఖ్‌నవూలోని ఆయన ఇంటి వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి బయటే నిరసనకు దిగారు. లఖీంపుర్ ఖేరీకి వెళ్తున్న నేతలను ప్రభుత్వం అడ్డుకుంటోంది.. అసలు ఇంతకు ఏం దాస్తోందని ప్రశ్నించారు. ‘భాజపా ప్రభుత్వం రైతులపై పాల్పడుతున్నన్ని దారుణాలు బ్రిటిష్ వారూ పాల్పడలేదు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య వెంటనే రాజీనామా చేయాలి. ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.2 కోట్ల చొప్పున పరిహారం ప్రకటించాలి. బాధిత కుటుంబాల్లోని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి’ అని అఖిలేశ్ డిమాండ్ చేశారు. అనంతరం ఉద్రిక్తతల నడుమ పోలీసులు ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున బలగాలను మొహరించారు. మరోవైపు ఆయన ఇంటి సవిూపంలో ఓ పోలీసు వాహనానికి కొందరు నిప్పంటించారు.
ప్రియాంకా గాంధీ అరెస్టు..గదిని ఊడ్చి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకురాలు
లఖింపుర్ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాను యూపీ పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. ‘నేనేం నేరం చేయడం లేదు. బాధిత కుటుం బాలను పరామర్శించేందుకు వెళ్తున్నాను. కానీ, విూరు నన్ను ఆపుతున్నారు. ఏ కారణంతో? అయినా.. అరెస్టు చేసేందుకు వారెంట్ అవస రం’ అంటూ ప్రియాంక గాంధీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేల కు ప్రియాంకను అరెస్టు చేసిన పోలీసులు సీతాపుర్‌లోని రాష్ట్ర అతిథి గృహాని కి తరలించారు. ఈ క్రమంలో ఆమె తనను నిర్బంధించిన గదిలోనూ నిరసన కొనసాగించింది. ఆ గదిని చీపురుతో శుభ్రం చేస్తున్నట్లు కనిపించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘ఈ నిరసన.. అన్నదాతల హక్కుల సాధన కోసం. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం. భాజపా ప్రభుత్వం ఈ హక్కులను అణచివేయలేదు. గాంధీ మార్గంలో ఈ పోరాటం కొనసాగుతుంది’ అని రాసుకొచ్చింది. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ప్రియాంక గాంధీ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పార్టీ ఆరోపించింది.
‘అన్నదాతలను గెలిపించేలా చేస్తాం’
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాను సైతం పోలీసులు అడ్డుకున్న అరెస్టు చేసిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘ప్రియాంకా.. నాకు తెలుసు.. నువ్వు వెనకడుగేయవని. నీ ధైర్యానికి వారు భయపడిపోయారు. న్యాయం కోసం జరుగుతున్న ఈ అహింసా పోరాటంలో.. మేము అన్నదాతలను గెలిపించేలా చేస్తాం’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి ఎస్‌ఎస్ రాంధవా లఖ్‌నవూ విమానాశ్రయంలో దిగేందుకు యూపీ ప్రభుత్వం అనుమతించలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారం
లఖింపుర్ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు హావిూ ఇచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై హైకోర్టు విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశించింది.సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం రైతులు చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. రహదారిపై నిరసన వ్యక్తంచేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన అన్నదాతలు దాడి చేయడంతో ఓ కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ జర్నలిస్టు ఈ ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.