ఇక సెలవు.. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌

కన్నుమూత
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
చెన్నయ్‌, ఆగస్టు 14 (జనంసాక్షి):
కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ (67) మరణించారు. నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రి లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన భార్య, కుమారులు ఆసుపత్రిలో ఉన్నారు. ముంబాయిలోని బ్రీచ్‌కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 6వ తేదీన చెన్నయ్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆయన కు భార్య వైశాలి, అమిత్‌, రితేష్‌, ధీరజ్‌ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. విలాస్‌రావు పార్దీవదేహాన్ని చెన్నయ్‌ నుంచి మహారాష్ట్రకు తరలించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఆయన మే 26, 1945న మహారాష్ట్ర లోని లాతూరులోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1982-1995 మధ్య మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో శాఖలను నిర్వహించారు. 1999-2003, 2004-2008లలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009లో కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. 2011, జులై నుంచి కేంద్ర,శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన ముగ్గురు కుమారుల్లో ఒకరైన రితేష్‌ దేశ్‌ముఖ్‌ నటుడు. రితేష్‌ ఇటీవలె జెనీలియాను వివాహమాడిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ మరణవార్త తెలీగానే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. అలాగే పార్లమెంటు ఉభయసభలు దిగ్భ్రాంతి ప్రకటించాయి. అనంతరం ఇరు సభలను గురువారం నాటికి వాయిదా వేశారు. తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా మహారాష్ట్ర సిఎం పృధ్వీరాజ్‌, తదితర మంత్రులు కూడా సంతాపం ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆయన మరణవార్త తెలుసుకున్న లాతూరు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదే నియోజకవర్గం నుంచి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ పలుమార్లు జరిగిన ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే.