ఈనెల 23ను విద్రోహదినంగా పాటించాలి: కోదండరాం

హైదరాబాద్‌: ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని పాలక, ప్రతిపక్ష, ఇతర పార్టీల నేతలకు స్పష్టమైన సంకేతాలను తెలంగాణ ప్రజలు పంపాలని ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. ఇందుకోసం ఈ నెల 23 ఆదివారం గ్రామగ్రామాన నల్లజెండాలతో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఇవాళ హైదరాబాద్‌ లోటన్‌పాండ్‌లో వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మను ఐకాస నేతలతో పాటు కోదండరాం కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయమ్మతో తాము చెప్పవలసింది చెప్పామని, ఆమె ఆలోచించుకుంటామని అన్నారని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఇక్కడి ప్రజలు సంతోషిస్తారని, లేదంటే స్థానం లేకుండా చేస్తారనే విషయాన్ని అన్ని పార్టీలు గమనించాలని కోరారు. డిసెంబరు 23ను విద్రోహదినంగా తెలంగాణా ప్రజలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించేలా వ్యవహరించాలని కోదండరాం కోరారు.