ఉగాది అందరి జీవితాల్లో ఆనందం నింపాలి..
………..
సింగరేణి భవన్ లో ఉగాది సంబురాల్లో జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్
———————————————==
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితంలో ఆనందాలు నింపాలని, ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను, అలాగే కంపెనీ నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాధించేలా చూడాలని జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్ ఆకాంక్షించారు.
బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో నిర్వహించిన ఉగాది సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ మార్గనిర్దేశంలో డైరెక్టర్ల పర్యవేక్షణలో ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా 67 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్దేశించుకున్న 75 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు.
సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో కంపెనీ దేశంలోనే నెంబర్ -1 స్థానంలో నిలవడమే కాకుండా థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి విజయవంతంగా అడుగుపెట్టిందని గుర్తుచేశారు. దేశంలోని నవరత్న కంపెనీలకు దీటుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. కంపెనీ అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం సీఎండీ అనేక చర్యలు తీసుకున్నారని, దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు సింగరేణి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
కార్యక్రమంలో బొగ్గు గని అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖరరావు మాట్లాడుతూ.. సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ తీసుకున్న బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలతో సింగరేణికి బలమైన ఆర్థిక పునాదులు ఏర్పడ్డాయన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ఉగాది సందేశం ప్రతులను ఉద్యోగులకు పంపిణీ చేశారు. కవి జయరాజ్ ప్రకృతిపై ఆలపించిన గీతం అందరినీ ఆకట్టుకుంది. ఉద్యోగులందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, అన్ని విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– జనం సాక్షి – హైదరాబాద్