ఏఐసీసీ ఆఫీసు ఎదుట అమరవీరుల కుటుంబ సభ్యుల నిరసన

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం ఎదుట తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో జాప్యం కారణంగా తమ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్లనే తమ బిడ్డలను పోగొట్టుకోవాల్సి వచ్చిందని వారు ఆరోపించారు. తమ బిడ్డల చావులకు ఎవరు బాధ్యతవహిస్తారని వారు ప్రశ్నించారు. ఇప్పటి వరకు 700 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు, ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, ఈ మరణాలకు యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ బిడ్డల ఆత్మశాంతించాలంటే, మరికొందరు బిడ్డలు ఆత్మబలిదానాలకు పాల్పడకుండా ఉండాలంటే సత్వరమే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని అమరవీరుల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. న్యాయవాది అరుణ్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళన జరిగింది.