ఏకీకృత ఫీజు కేసు 1కి వాయిదా

న్యూఢిల్లీ: 2012-13సంవత్సరానికి వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ కేసు ఆగస్టు 1వ తేదీకి వాయిదాపడింది. ఈ విద్యా సంవత్సరానికి ఏకీకృత ఫీజు కాకుండా ఇదివరకటిలాగానే ద్వంద్వ ఫీజు(ఎ-బి కేటగిరీ) విధానం అమలుచేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలుచేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తులో సవరణలు చేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో శుక్రవారం జస్టిస్‌ ఆర్‌.ఎం.లోధా, జస్టిస్‌ ఎ.ఆర్‌.దవేలతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదావేసింది. ఆగస్టు 1వ తేదీన విచారణ జరిగి దీనిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చినా అది 2012-13 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఏడాది కొత్తగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరేవారికి ఇచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఫీజులు వర్తింపజేయాలి అన్న ఆంశంపై సెప్టెంబర్‌ 25వ తేదీన జరిగే తుది విచారణ తర్వాతే స్పష్టత వస్తుంది.