కండకావరపు వ్యాఖ్యలు
రాజాసింగ్ భాజపా నుంచి వెలి..
` కేసు నమోదు..అరెస్టు.. విడుదల
` నాంపల్లి కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్(జనంసాక్షి):
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడిరది. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది. సోషల్ విూడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన ఒక వీడియో వివాదాస్పదమై వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. దీంతో ఒక వర్గం సోమవారం రాత్రి నుంచి ఆందోళనకు దిగింది. అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పార్టీ క్రమశిక్షణ సంఘం భావించింది.ఈ మేరకు రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి సంబంధించిన బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తక్షణమే తప్పిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు పేర్కొంది. వచ్చే నెల 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది.వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. మంగళ్‌హాట్‌లో ఖాదీర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు.అక్కడి నుంచి నాంపల్లికోర్టుకు తీసుకొచ్చి 14వ అదనపు మెట్రోపా లిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చారు. సుప్రీంకోర్టు నిబం ధనల ప్రకారం 41 సీఆర్పీసీ పాటించకుండా ఎలా రిమాండ్ చేస్తారని రాజాసింగ్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌కు కోర్టులోనే సీఆర్పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు. పోలీసుల రిమాండ్ పిటిషన్ స్వీకరించిన నాం పల్లి కోర్టు రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత రాజాసింగ్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణకు అంగీకరించింది. ఈక్రమంలో రాజా సింగ్ పాత కేసులు కూడా పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించా రు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌ను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.రాజాసింగ్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టు వద్దకు రాజాసింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేశారు. కోర్టు సవిూపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ క్రమంలో నిరసనకారులు కోర్టు ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. మరో వైపు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా అబిడ్స్‌లోని జగదీష్ మార్కెట్ వ్యాపారులు బంద్ పాటించారు. మార్కెట్ నుంచి అబిడ్స్ పీఎస్ వరకు వ్యాపారులు ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్‌పై హైదరాబాద్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.