కరెంట్‌ కోత… దోమల మోత

ఖమ్మం, అక్టోబర్‌ 28 : జిల్లా కేంద్రంలో రోజు పగటిపూట ఆరు గంటల కరెంట్‌కోతకు తోడు ప్రతిరోజు రాత్రిపూట మూడు నుండి నాలుగు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తుండడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు మినహా మిగిలిన రోజుల్లో  విద్యుత్‌ సరఫరా చేస్తుండగా గృహ అవసరాలకు మాత్రం ఎడాపెడా కోతలు విధిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విధిస్తున్న కోతలకు అదనంగా రాత్రుల్లో అనధికార కోతలు విధిస్తుండడంతో ప్రజలు నరకయాత్ర అనుభవిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికీ రాత్రిపూట రెండు నుంచి నాలుగు గంటల వరకు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలతో ట్రాన్స్‌కో అధికారులు కుమ్మక్కు అవుతుండడం వల్లే ప్రతిరోజు జాగారం తప్పడం లేదని జనం వాపోతున్నారు. గంటల తరబడి కోతలు అమలు చేస్తుండడంతో కనీసం బ్యాటరీలు పూర్తిస్థాయిలో చార్జీ అయ్యే పరిస్థితి కూడా లేదు. కరెంట్‌ కోతలకు తోడు దోమలు విజృంభించడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గృహావసరాలకు విధిస్తుండడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఖమ్మం ట్రాన్స్‌కో ఎస్‌ఇ    సుధాకర్‌ను వివరణ కోరగా పరిశ్రమలు మూతపడితే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందన్న కారణంగా పవర్‌హాలిడే మినహా మిగిలిరోజుల్లో పరిశ్రమలకు కోతలు విధించడంలేదని ఆయన అన్నారు. కొద్దిరోజులపాటు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.