కేసీఆర్‌ పదవి విరమణ సభ!

– సభ అట్టర్‌ప్లాప్‌తో తెరాస శ్రేణులను నిస్తేజం ఆవరించింది
– కేసీఆర్‌ ప్రభ ఎలా తగ్గుతుందో సభతో నిరూపితమైంది
– జనసమితి అధ్యక్షుడు కోదండరాం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3(జ‌నం సాక్షి) : టీఆర్‌ఎస్‌… కొంగర కలాన్‌ వేదికగా ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ కేసీఆర్‌ పదవీ విరమణ సభ అంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అది ప్రగతి నివేదన సభ కాదని, పదవి విరమణ సభలా సాగిందన్నారు. బల ప్రదర్శన, గర్జన అంతకంటే కాదని, స్వీయ వేదనలా ఉందని ఎద్దేవచేశారు. దీపం ఆరిపోయోముందు చివరి తేజంలా కేసీఆర్‌ తీరు ఉదంటూ కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రజలకు దూరమై అధికారాన్ని సొంత ఆస్తిలా భావించిన కేసీఆర్‌, రాజకీయంగా, ప్రభత్వపరంగా తన విధానం చెప్పుకోవడంలో విఫలం అయ్యారని అన్నారు. టీఆర్‌ఎస్‌ సభ గులాబి గర్జనలా సాగుతుందని ఆశించారని, కానీ, వెలవెలబోయిందన్నారు. సభకు 25 లక్షల మంది వస్తారని తెరాస నేతలు భావించారని కానీ వారి అంచనా వేసిన దానిలో ఐదవ వంతు జనం కూడా రాలేదని కోదండరాం ఎద్దేవా చేశారు. సభలో ముఖ్యమైన ప్రకటనలు చేస్తారనుకున్నారని, ఏదో జరిగిపోతుందని ప్రజలు ఆశించారని, కానీ సభకు ఆశించిన స్థాయిలో జనాలు రాకపోవటంతో కేసీఆర్‌ తన ప్రసంగాన్ని తుస్సుమనిపించారని అన్నారు. సభకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని వాడారని విమర్శించారు. వ్యవసాయానికి, వస్తు రవాణాకు వాడే ట్రాక్టర్లను ప్రజల తరలింపునకు వాడారని, జనం విహారయాత్రకు వచ్చినట్టు వచ్చి ఎంజాయ్‌ చేశారని కోదండరాం  అన్నారు. ప్రగతి నివేదన సభకు ఉపాధి కూలీలలో పాటు
అన్ని రకాల వారిని తరలించడానికి అధికారులు ప్రయత్నం చేశారని, మైక్‌ టైసన్‌ లాగా గెలిస్తారని అనుకుంటే మొదటి రౌండ్‌లోనే నిష్కమ్రించినట్టుగా కేసీఆర్‌ పరిస్థితి ఉందంటూ కోదండరాం సెటైర్లు వేశారు. మొత్తానికి కేసీఆర్‌ సభతో ప్రజాధనం, సమయం దుర్వినియోగం అయిందే తప్ప, అటు తెరాసకు, ఇటు ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చలేదని కోదండరాం విమర్శించారు.