కోఠి ఆసుపత్రిలో గర్భిణి మృతి
హైదరాబాద్: కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో చికిత్స పొందుతూ గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి చనిపోయిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతో పరస్థితికి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మమత (గర్భిణి) ఇదే ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స చేయించుకుంటోంది. సోమవారం రాత్రి ఒంటిగంటకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణితో పాటు బిడ్డ మృతిచెందిందని.. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.