కోలాహాలంగా బెల్లంపల్లి సిఓఈ వార్షికోత్సవం.


– అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
– ముఖ్య అతిధుల చేతిలో మీదుగా టాపర్స్ కు పురస్కారాలు అందజేత.
– బెల్లంపల్లి సి ఓ ఈ చదువుల నిలయం అన్న వక్తలు.
బెల్లంపల్లి, మార్చ్ 12, (జనంసాక్షి )
తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సిఓఈ బెల్లంపల్లి వార్షికోత్సవం కోలాహలంగా జరిగింది. శనివారంరాత్రి కళాశాలలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి రూరల్ సిఐ కె.రాజ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసాన్ని కొనసాగించడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదగవచ్చునన్నారు. బెల్లంపల్లి సిఓఈ లో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య, ఇక్కడి బోధనా సిబ్బంది కమిట్మెంట్ కు విద్యార్థుల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్న సిఓఈ సాధిస్తున్న విజయాలు విద్యావ్యవస్థకు తలమానికంగా ఉండడం అభినందనీయమన్నారు.
ఇప్పటివరకు ఉన్నత విద్యావకాశాలు పొందిన విద్యార్ధులగురించి విని ఆశ్చర్యపడ్డానని సిఓఈ సాధించిన విజయాలు అద్బుతంగా ఉన్నయన్నారు. ఐఐటి, నీట్ వంటి అత్యున్నత ప్రవేశ పరీక్షల్లో రాణించడంతోపాటు దేశంలోనే ఉత్తమమైన యూనివర్సిటీల్లో సీట్లు సాధించడం ఇక్కడి బోధనా సిబ్బంది డెడికేషన్, కమిట్ మెంట్,త్యాగానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన తాళ్ల గురజాల ఎస్సై రాజశేఖర్, బాలికల గురుకుల ప్రిన్సిపల్ సందారాజ స్వరూప, చంద్రవెల్లి పీజిహెచ్ఎం దుర్గం శ్రీనివాస్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు దాగం మహేష్ లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉత్తమ క్రమశిక్షణతో విద్యార్థులు సాధిస్తున్న ఉన్నత విద్యా అవకాశాల పట్ల తల్లిదండ్రులు సగర్వంగా చెప్పుకునేలా ఉండడం గొప్ప విషయం అన్నారు . కార్యక్రమంలో ముందుగా జ్యోతివెలిగించి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ ఐనాల సైదులు గత విద్యా సంవత్సరం విద్య, విద్యేతర కార్యక్రమాల్లో విద్యార్ధులు సాధించిన వివరాలతోకూడిన వార్షిక నివేదికను వెల్లడించారు. మూడున్నర దశాబ్దాల గురుకుల చరిత్రలో ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధి సాధించాడని ప్రకటించగానే విద్యార్ధులతోపాటు హాజరైన అథిదులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. విద్యార్ధులు, తల్లిదండ్రుల చప్పట్లతో ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం విద్యార్ధులు పాడిన పాటలు,సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్ అథిదులకు ఆహ్వానం పలకగా స్టాఫ్ సెక్రెటరీ శ్యాంసుందర్ రాజు కార్యక్రమం సభకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెవిపి దాసం అజిత, పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాగం మహేష్, రేణికుంట్ల శంకర్, బెడ్డల మహేందర్, నగేష్ గౌడ్, ఇప్పరవి, జమ్మి శ్రీనివాస్, షిండే దత్త ప్రసాద్, వరమని ప్రమోద్ కుమార్, రామిశెట్టి రామారావు, ఆకేనపల్లి రాజేష్, బొజ్జపల్లి సతీష్, తదితరులు పాల్గొన్నారు.