‘ఖని’లో ట జెండాగద్దెల కూల్చివేత…

– కబ్జాకు చుక్కెదురు

గోదావరిఖని, మే 27, (జనం సాక్షి):
స్థానిక ఆర్టీసి బస్‌డిపో సమీపంలో సింగరేణికి చెందిన స్థలంగా చెప్పబడుతున్న భూమిలో కొన్ని పార్టీలు ఏర్పాటు చేసిన జెండా గద్దెలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. సుమారు ఎకరానికి పైగా రాజీవ్‌ రహదారి ప్రక్కనే విలువైన భూమిగా ఉన్న ఈ స్థలంలో కాంగ్రెస్‌, టిడిపి, టిఆర్‌ఎస్‌ తదితర సంఘాలు జెండా గద్దెలను కట్టి… కబ్జా చేశారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. అలాగే ఈ స్థలమంతా మాదేనంటూ… అందులో నిర్మించిన జెండా గద్దెలను తొలగించాలని… శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్వాహక కమిటి పార్టీ నేతలను కోరింది. గద్దెలను నిర్మించిన స్థలాలను మా కార్యాలయాల భవన నిర్మాణానికి కేటాయించాలని సింగరేణి యాజమాన్యాన్ని పలుపార్టీలు కోరుతూ… వినతిపత్రం సమర్పించాయి. అయితే రాత్రికిరాత్రి ఈ గద్దెలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. దీనిపై పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కూల్చివేత ఘటనపై దేవాలయ కమిటి నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందురోజుల్లో నిర్మించబోయే దేవాలయ నిర్మాణానికి అందరు సహకరించాలని పలుపక్షాల బాద్యులు మడ్డి ఎల్లయ్య, కోటగిరి పాపయ్య, అచ్చవేణు, బి.శ్రీనివాస్‌, అశోక్‌కుమార్‌, రంగయ్య, రాజయ్య, ఏడుకొండలు తదితరులు కోరారు.