ఖరీఫ్‌పై మంత్రి సమీక్ష

హైదరాబాద్‌ : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వాతావరణ, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంట రకాల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ఈ నెల 15 లేదా 31 లోగా వర్షాలు కురవక పోతే స్వల్పకాలక వరి సహా ఆరుతడి పంటలైన కంది, అవరాలు సాగు ప్రొత్సహించాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, శాస్త్ర వేత్తలతో ఖరీఫ్‌ సీజన్‌, వర్షాభావం, పంటలు పరిస్థితిపై సమీక్షించారు. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కింద నారుమళ్లు పెద్దగా ప్రొత్సహించవద్దని మంత్రి సూచించారు. సాగర్‌ జలాశయం నిండకపోతే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. తెలంగాణతో సహా ఇతర జిల్లాల్లో పలు చోట్ల పత్తి విత్తనాలు విత్తారని, మిగతా ప్రాంతాల్లో వర్షాలకోసం నిరీక్షిస్తున్న దృష్ట్యా పరిస్థితి సానుకులంగా లేకపోయినట్లైతే రైతులకు అందజేయడానికి 97 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేయాలని కోరారు. రాయలసీమలో వర్షాభావం తీవ్రంగా ఉండగా ఉత్తర తెలంగాణ, కోస్తా ఆంధ్రలో పరిస్థితి బాగానే ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.