ఖానాపూర్ మున్సిపల్ లో ముసలం…ఖానాపూర్ మున్సిపల్ లో ముసలం…

– ఏకమౌతున్న అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు- మున్సిపల్ చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లు గా సాగుతున్న పోరు- వరుసగా పలు సమావేశాలకు కౌన్సిలర్ల గైర్హాజరు- ఎమ్మెల్యే వద్దకు చేరిన పంచాయతీ ? – చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకే ఇదంతా అంటూ ప్రచారంఖానాపూర్ ఏప్రిల్ 03(జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపాలిటీ పాలకవర్గంలో వివాదాలు ముదురుతున్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు అనే బేధాలను పక్కనపెట్టి చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లుగా సీన్ మారిపోయింది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల కోసం ఏర్పాటు చేసిన పలు సమావేశాలు పలుమార్లు కోరం లేక వాయిదా పడడం చూస్తే ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. నిన్న మొన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు జరిగిన ప్రచారాన్ని ఇటు పాలకపక్షం కొట్టి పారేసింది. కానీ అధికార పార్టీలోని మెజారిటీ కౌన్సిలర్లు ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి కౌన్సిలర్లతో ఏకీభవిస్తున్నట్లు గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత మూడేళ్లుగా చేసిన పనుల తాలూకు జమ ఖర్చుల వివరాలను తమకు చెప్పడం లేదంటూ కౌన్సిలర్లు బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ను చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించుకొన్న తర్వాతనే ఈ వివాదాలను తెరపైకి చేస్తున్నట్లు తెలుస్తోంది. లెక్కలు చూపడం లేదు అనేది సాకుగా మాత్రమే చూపి సమావేశాలకు గైర్హాజరవుతూ పాలకపక్షంలోని కౌన్సిలర్లు సైతం చైర్మన్ పట్ల తమ అసంతృప్తిని అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఈ పంచాయతీ ఎమ్మెల్యే వద్దకు చేరినట్లు సమాచారం. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోని ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ ను అధికారపక్షంలోకి తీసుకొని చైర్మన్ పదవిని కట్టబెడతారంటూ జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల్లో కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాస నోటీసులు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా  బడ్జెట్ సమావేశం నిర్వహించిన రోజున మున్సిపల్ కార్యాలయ ఆవరణలో  పలువురు అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు చైర్మన్, కమిషనర్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం నేపథ్యంలో అధికార పార్టీలో చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్లు అన్నట్లుగా సాగుతున్న ఈ పోరు ఎవరికి నష్టం చేస్తుందో అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది ఎన్నికల ఎటువంటి వివాదాల జోలికి పోకుండా తలెత్తిన ఈ సమస్యను అధికార పార్టీ ఆదిలోనే తుంచి వేస్తుందా లేక అవిశ్వాసం వరకు తీసుకువెళ్తుందా అనే అంశంపై ఇటు పాలక వర్గంలోని నాయకులు అటు ప్రతిపక్షాల నాయకులు నిశితంగా పరిశీలిస్తున్నారు.