గ్రామపంచయితి కార్మికులు పెండింగ్ జీతాల కోసం యం.పి.డి.ఓ.కు. సమ్మె నోటీసు ఇచ్చారు

రఘనాదపాలెం మార్చి 03(జనం సాక్షి) మండలంలో గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందికి అనేక నెలలుగా జీతాలు చెల్లించకుండా కాలయాపన చేయడంతో పస్తులుంటూ సిబ్బంది పనిచేస్తున్నారని వెంటనే సిబ్బందికి రావాల్సిన పెండింగ్ జీతాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పిట్టల మల్లయ్య, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కార్యాలయం ఎదుట ఎఐటియుసీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిబ్బంది పెండింగ్ జీతాలు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు అనంతరం యం.పి.డి.ఓ రామకృష్ణ కు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. అసలే పంచాయతీ సిబ్బందికి ఇచ్చేవి అతితక్కువ జీతాలు అవి సక్రమంగా నెల నెలా అందించకపతే సిబ్బంది పస్తులతో పనిచేయాలని ప్రశ్నించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సిబ్బంది పెండింగ్ జీతాల సమస్య ఏర్పడింది జీతాల సమస్య పరిష్కరించాలని సంభందిత కార్యదర్శులు, సర్పంచులు, పాలక వర్గాన్ని అడిగితే రేపు మాపు అని కాలయాపన చేస్తూ సిబ్బందితో పనిచేయించు కుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఇచ్చే జీతం సక్రమంగా ఇవ్వకపోతే సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడ్తాయని తెలిపారు. ఇప్పటికైనా సిబ్బందికి రావాల్సిన పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని లేదంటే మార్చి 15 తర్వాత నిర్వధికంగా సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు గుగులోతు రాందాస్, యం. రాజగోపాల్, బి. మంగీలాల్, కె. ప్రవీణ్, వెంకన్న, జి.విజయ్, జి. నారాయణ, ఉపేందర్, రామకృష్ణ, జేల్యా, ఎ.సైదులు, లాలు, కోటేశ్వరరావు, రాజు, వీరన్న, లింగయ్య, శివలాల్, వెంకటేష్, బీమా, బి. వెంకన్న, సి.హెచ్. సైదులు, తదితరులు పాల్గొన్నారు.