చిన్నపిల్లలకు కోవాగ్జిన్
దిల్లీ,అక్టోబరు 12(జనంసాక్షి):కరోనా బారి నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా కేంద్రం శుభవార్త చెప్పింది. 2`18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి సిఫార్సులు చేసిందిప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన కొవాగ్జిన్ టీకాపై ఇటీవల ఆ సంస్థ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2 నుంచి 18ఏళ్ల వారి కోసం కొవాగ్జిన్ టీకా 2, 3 దశల ప్రయోగాలను గత నెలలో పూర్తి చేసిన భారత్ బయోటెక్.. ఆ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థకు(డీసీజీఐ) అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన డీసీజీఐ నిపుణుల కమిటీ.. పిల్లలకు కొవాగ్జిన్ టీకా ఇచ్చేలా అత్యవసర అనుమతులు జారీ చేయాలని సిఫార్సులు చేసింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేయడమే తరువాయి.కేంద్రం అనుమతి లభిస్తే భారత్‌లో పిల్లలకు అందుబాటులో వచ్చే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ఇదే కానుంది. పిల్లలకు ఇచ్చే కొవాగ్జిన్ టీకా కూడా రెండు డోసుల టీకానే. తొలి డోసు ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్`డి టీకాకు కేంద్రం అత్యవసర అనుమతులు మంజూరుచేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను 12ఏళ్ల పైబడిన వారందరికీ ఇచ్చేలా అభివృద్ధి చేశారు. అయితే జైకోవ్`డి వ్యాక్సిన్ పంపిణీని సంస్థ ఇంకా ప్రారంభించలేదు.