చైనాను నియంత్రిద్దాం
– భారత్, జపాన్, ఆస్ట్రేలియా సమిష్టి వ్యూహం
దిల్లీ,డిసెంబరు 6(జనంసాక్షి):జపాన్, ఆస్ట్రేలియాలతో త్రైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. పరస్పర వాణిజ్యం (మ్యూచువల్ ట్రేడ్), ఇన్వెస్ట్మెంట్లను (పెట్టుబడులు) ప్రోత్సహించేందుకే ఈ ఒప్పందానికి తెర తీస్తోంది. సరఫరా గొలుసు వ్యవస్థ పునరుద్ధరణ చొరవలో (ఎస్సీఆర్ఐ) భాగంగా ఈ 3 దేశాలు చైనాతో వాణిజ్యాన్ని సమానంగా తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. 3 దేశాల త్రైపాక్షిక వాణిజ్య సంబంధాల్ని బలోపేతం చేయడానికి, ప్రభుత్వంతో పాటు పరిశ్రమలు, విద్యా సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని తమదైన భావజాలం ఉన్న మిగతా దేశాలు కూడా సురక్షితమైన సరఫరా వ్యవస్థలను నిర్మించడానికి ఈ 3 దేశాలు సహకారం అందిస్తాయి. పారిశ్రామిక పార్కులు, క్రమబద్ధమైన రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ, మెరుగైన సముద్ర, వాయు అనుసంధానతల్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఇవి సంసిద్ధంగా ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాణిజ్య పత్రాల డిజిటలీకరణ, పారదర్శకతను మెరుగుపర్చడానికి.. నియంత్రణ సమాచార మార్పిడి కూడా త్రైపాక్షిక వాణిజ్య ఒప్పంద అజెండాలో చర్చకు ఉందని పేర్కొన్నాయి. భారత్, ఆస్ట్రేలియాలతో వాణిజ్య ఒప్పంద ప్రతిపాదనను తొలుత జపాన్ తీసుకొచ్చింది. చైనా విూద ఆధారపడటం తగ్గించి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకుందామని సూచించింది. దీంతో భారత్-జపాన్ పారిశ్రామిక పోటీతత్వ భాగస్వామ్య చట్రంలో ముందుకు సాగాలని భారత్ సిద్ధమైంది. ఆసియాన్-జపాన్ ఎకనమిక్ రెసిలియన్స్ యాక్షన్ ప్లాన్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా జపాన్ కూడా ఈ ప్రక్రియలో చేరనుంది. కాగా, 2019లో భారత్, జపాన్, ఆస్ట్రేలియాల సంచిత స్థూల దేశీయోత్పత్తి (క్యుములేటివ్ జీడీపీ) 9.3 ట్రిలియన్ డాలర్లు. (సుమారు రూ.688 లక్షల కోట్లు).