జోరుగా బట్టి పాదయాత్ర.

– అడుగడుగునా జన నీరాజనం.
– కాంగ్రెస్ లో జోష్ పెంచిన పాదయాత్ర.
బెల్లంపల్లి, ఏప్రిల్ 1, (జనంసాక్షి )
కాంగ్రెస్ శాసనసభపక్ష నేత మల్లు బట్టి విక్రమార్క పాదయాత్రకు జనం నీరాజనం పలికారు. శనివారం బెల్లంపల్లి నియోజకవర్గం లోని నెన్నెల మండలం మెట్ పల్లిలో ప్రారంభం అయిన పీపుల్స్ మార్చ్ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర గంగారాం వరకు కొనసాగింది. మెట్ పల్లి, చిత్తాపూర్, ఆవడం, గంగారం వరకు పాదయాత్ర కొనసాగగా ఆయన వెంట డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, రామగుండం కాంగ్రెస్ నాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ లు ఉన్నారు. అనంతరం గంగారాం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంపదను, ఆస్తులను అమ్ముకోవడానికి తెలంగాణ తెచ్చుకోలేదన్నారు. ప్రభుత్వ భూములను అమ్మడం తెలంగాణను అమ్మకానికి పెట్టినట్లేనని విమర్శించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను నిధుల సేకరణ పేరుతో ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం సరికాదని, భవిష్యత్తు తరాలకు భూములు, నిధులు పోగుచేసి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చిందని, పేద, మధ్యతరగతి కుటుంబాలు, కిందిస్థాయి ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చడానికి లాభాపేక్ష లేకుండా హౌసింగ్ బోర్డు ద్వారా నిర్మాణాలు చేపట్టి ఇచ్చిందన్నారు. స్వగృహ పథకం కింద నిర్మాణానికైనా ఖర్చు మాత్రమే తీసుకొని ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ ఎత్తివేయడం విడ్డూరంగా ఉందన్నారు. హౌసింగ్ బోర్డ్, దిల్ భూములను అమ్మాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచన అన్నారు. ఇల్లు లేకుండా లక్షల మంది పేదలు తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నా బీఆరెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అయితలేదన్నారు. భూములను అమ్మకానికి పెట్టడం భవిష్యత్తు తరాలకు ప్రమాదకరం అని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల అమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. మోడీ, అమిత్ షా తరహాలోనే కేసీఆర్ కూడా తెలంగాణ వనరులను తనకు కావలసిన వారికి దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.
బొగ్గు గనులను ప్రైవేటు చేసినట్టే మిగత తెలంగాణ వనరులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారకులైన బోర్డును తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్న కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. నాలుగు సంవత్సరాలకు సంబంధించిన నిరుద్యోగ భృతి లెక్క కట్టి చెల్లించాలని డిమాండ్ చేశారు.
చతిస్గడ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి నెలకు 2,500 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పడి 9 ఏళ్లు దాటుతున్న గోదావరి, కృష్ణ పై నిర్మించిన ప్రాజెక్టులతో ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ఇవన్ని ప్రశ్నిస్తే కేసులు, సంక్షేమ పథకాలు బందు చేస్తామని బెదిరింపులకు పాల్పడడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా సాగునీటినందిస్తూ కాలేశ్వరం నీళ్లు అని గొప్పలు చెప్పుకోవడం సరైనది కాదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగిన కాలువలు నిర్మించలేదన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను సీతారామ గా పేరు మార్చి ఏళ్లు గడుస్తున్న ఒకే ఎకరానికి కూడా సర్కారు నీళ్లు ఇవ్వలేదన్నారు. కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ పూర్తి చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ మోడల్ లిక్కర్ పాలసీని ఢిల్లీలో అమలు చేశారని, గతంలో ప్రభుత్వ పెద్దలు చాలా గొప్పగా చెప్పారని, తెలంగాణలో రూపొందించిన మోడల్ మద్యం పాలసీ ఢిల్లీలో కుంభకోణానికి దారితీస్తే మరి తెలంగాణలో కూడా మద్యం స్కాం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తెలంగాణ మద్యం పాలసీ పై కూడా సమగ్రమైన విచారణ జరపాలి అని దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తానని అన్నారు. బెల్టు షాపులు వద్దంటున్న సర్పంచులపై పరోక్షంగా అధికారుల ఒత్తిడిలు, వేధింపులు పెరిగిపోతున్నాయని తెలిపారు. లక్షల కోట్ల ప్రజల సంపద దోపిడీ చేసి పోగేసుకొని ఎన్నికలు రాగానే కొత్త స్కీములు తెస్తూ డబ్బుతో గెలుస్తామని ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, డబ్బు ఒకటే చూడరని, మంచి అభ్యర్థిని చూస్తారని అన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ సింగరేణి ఆస్తుల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ అంగీకరించదన్నారు. ఈకార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, రామగుండం కాంగ్రెస్ నాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, దాగం రమేష్, దుర్గం రవి, గట్టు మల్లేష్, ఉయ్యాల మల్లిక, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.