జ్యోతిష్య సభలకు వేదికగా హైదరాబాద్
రెండురోజులపాటు రవీంద్రభారతిలో సభలు
13,14 తేదీల్లో జ్యోతిష్య మహాసభలు
పలు అంశాలపై చర్చలో పాల్గొననున్న పండితులు
హైదరాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): భారతీయ సంస్కృతిలో జ్యోతిష్యం ఓ భాగం. సనాతన సంప్రదాయం దీనిని కూడా శాస్త్రీయంగా ఆలోచన చేసింది. నేటికి తిథి,వార,నక్షాత్రాలలు లేకుండా రోజులు గడవవు. జ్యోతిష్యానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. ఈ దశలో రెండోసారి హైదరాబాద్ వేదికగా జ్యోతిష్య సభలు జరుగబోతున్నాయి. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటుహైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర జ్యోతిష్య మహాసభలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో వున్న అనుభవజ్ఞులైన సిద్ధాంతులను, పంచాంగకర్తలను, జ్యోతిష్య పండితులను ఒకే వేదికపైకి తీసుకు రావాలన్నది ఈ మహాసభల ప్రధాన ఉద్దేశం. జ్యోతిష్య మహాసభలు రాష్ట్రంలో నిర్వహించడం ఇది రెండో సారి. గతేడాది సెప్టెంబర్ 9, 10 తేదీలలో హైదరాబాద్ లలితా కళాతోరణం, రవీంద్ర భారతిలలో తొలిసారిగా ఈ సభలు జరిగాయి. అంతవరకు ఎప్పుడు, ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా సాంప్రదాయబద్ధంగా జ్యోతిష్య మహాసభలు వైభవంగా నిర్వహించారు. ఆనాటి ప్రారంభ కార్యక్రమానికి మదుసూదనానంద సరస్వతీ స్వామి, వ్రతధర రామానుజ జీయర్ స్వామి, సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సూర్య, చంద్రుల సాక్షిగా జ్యోతిశ్శాస్త్రం, ఇతర శాస్త్రాల కన్నా వివాదం లేకుండా సఫలమైంది, కాబట్టి, సనాతన జ్యోతశ్శాస్త్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం విూద వుంది. ఇందులో భాగంగా ఆగమ, ధర్మశాస్త్రాల సదస్సులు కూడా జరగనున్నాయి. ఈ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సంయుక్త సహకారాన్ని అందిస్తున్నాయి. మొదటి రోజు, మొదటి సదస్సు జ్యోతిశ్శ శాస్త్రంలోని పంచాంగ విభాగంపై వుంటుంది. ఇందులోని నాలుగు ప్రధాన అంశాలపై విఖ్యాతులైన పండితులు, సిద్ధాంతులు ప్రసంగిస్తారు. ఈ నాలుగు ప్రధానాంశాలు వరుసగా… పంచాంగ ప్రామాణికత
ముహూర్త నిర్ణయం; కాలసర్ప, పితృదోష విశ్లేషణ; గుణమేళనం- నామ నక్షత్ర ప్రాధాన్యత; కుజదోష ప్రభావం. రెండవ సదస్సులోని నాలుగు అంశాలు వరుసగా… జాతక ఫల నిర్ణయ సవిూక్ష; ఆధునిక దృక్కోణంలో జ్యోతిషం; జ్యోతిశ్శాస్త్ర వివిధ విభాగాలు; వాస్తు విజ్ఞాన ప్రయోజనం. అదే రోజు సాయింత్రం యువ సిద్ధాంతుల సమ్మేళనం జరుగుతుంది. ఇందులో వర్థమాన సిద్ధాంతులందరూ పాల్గొంటారు. ఆ తరువాత ‘విద్వత్సమ్మేళనం’ వుంటుంది. ఇందులో సిద్ధాంతులు, వేదపండితులు, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, ప్రధాన పురోహితులు, ధర్మకర్తలు పాల్గొని, వచ్చే తెలుగు సంవత్సరాది శ్రీవికారి నామ సంవత్సర పండుగల తేదీలను సైద్ధాంతికంగా నిర్ణయం చేస్తారు. ఈ ఏడాదిలాగే వచ్చే సంవత్సరానికి కూడా వీటినే ప్రామాణికంగా తీసుకునే అవకాశం వుంది.
రెండవరోజు మొదట ఆగమ శాస్త్రంపై సదస్సు వుంటుంది. ఇందులోని మొదటి అంశం ‘ఆగమాలు- ఆలయాలు’, రెండవ అంశం ‘ఆలయపాలన-ధర్మరక్షణ’, మూడవ అంశం ‘అర్చకుల విధ్యుక్త ధర్మాలు’, నాల్గవ అంశం ‘ధార్మిక స్ఫూర్తికేంద్రం- ఆలయం’. తదనంతరం ధర్మశాస్త్ర సదస్సు జరుగుతుంది. ఇందులోనూ నాలుగు అంశాలుంటాయి. అవి వరుసగా… ధర్మాచరణలో దైవజ్ఞుల పాత్ర, ధర్మమార్గ నిర్దేశకులు -పురోహితులు, ధర్మసంస్థాపనలో ధర్మాచార్యులు, సంస్కారాల ప్రయోజనం. అదే రోజు సాయంత్రం జ్యోతిష్య పండితులతో నిర్వహించే ‘జ్యోతిరాదిత్యమ్’ అనే రూపకం వుంటుంది. తరువాత సమాపనోత్సవ సభాకార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా విద్వత్సభా విశిష్ఠ పురస్కారాలతో జ్ఞానవయోవృద్ధులైన 12 మంది పండితులను సత్కరించనున్నారు. ఈ జ్యోతిష్య మహాసభలకు రాష్ట్రంలోని సిద్ధాంతులు, పండితులు, అభిమానులు, అర్చకులు, పురోహితులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.


