టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలన్నింటిపై విచారణ జరపాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్రంలో టీఎస్పిఎస్సీ నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ జరిపి కారకులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగెల వెంకటేష్ ,జిల్లా అధ్యక్షులు గోపగాని రవి కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.బుధవారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.పేపర్ లీకేజీ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించి, అవినీతికి పాల్పడిన అధికారులను తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. టిఎస్పిఎస్సి బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని కోరారు.రాష్ట్రంలో పలు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వెలువడిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగులు అహర్నిశలు కష్టపడి , ఉద్యోగాల కోసం కోచింగ్ కి వెళ్లి ప్రిపేరవుతుంటే పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకోవడం దుర్మార్గమని అన్నారు.ప్రభుత్వానికి విద్యార్థులు ,నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే ప్రభుత్వం స్పందించి టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కిరణ్, నరేష్ , వంశీ, తరుణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.