టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

భూపాలపల్లి, :కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం పెట్రోలు ధరలను విపరీతంగా పెంచటాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక కూరగాయల మార్కెట్‌ ప్రధాన రహదారి వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులు దర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సంధర్బంగా టిడిపి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ పెట్రోలు, డిజిల్‌, కిరోసిన్‌, వంటగ్యాస్‌ తదితర నిత్యావసర వస్తువుల ధరలను పెంచబోమని ప్రజలకు శుష్కవాగ్ధానాలు చేసి మాటతప్పిందన్నారు. యుపిఏ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇప్పటివరకు 35 సార్లు డిజిల్‌, పెట్రోలు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. పెట్రోలు ధరల పెంపు కారణంగా నిత్యావసర వస్తువుల ధరల పెంపు జరగడమే కాకుండా ఆ ప్రభావం రవాణా పై పడుతుందన్నారు ఫలితంగా ఆర్టీసి బస్సు చార్జీలు కూడా మళ్ళీ పెరిగే ప్రమాదం ఉందన్నారు. కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం కొనసాగుతుందని, ధరలను నియంత్రించలేని ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ప్రభుత్వంలో కొనసాగే ఆర్హత లేదని సత్యనారాయణరావు అన్నారు. అరగంట సేపు జరిగిన ఈ రాస్తారోకో కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కంకటి రాజవీరుగౌడ్‌, మాజి జెడ్పిటిసిలు లట్ట రాజబాబు, మత్యాల రాజయ్య నాయకులు చందుపట్ల తిరుపతిరెడ్డి, రాంనేని రవిందర్‌, కాల్వ రాంరెడ్డి, పోలు తిరుపతి, దుర్శెట్టి రాజయ్య, దుగ్యాల కిషన్‌రావు, శ్రీనివాస్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.