-->

డాక్టర్‌పై హత్యాచార కేసు సీబీఐకి

` కోల్‌కతా హైకోర్టు ఆదేశం
కోల్‌కతా(జనంసాక్షి): కోల్‌కతాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ సమయంలో కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.కేసు దర్యాప్తును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి బదిలీ చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలను బుధవారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందజేయాలని పేర్కొంది. సెమినార్‌ హాల్‌లో జూనియర్‌ వైద్యురాలిపై అత్యంత పాశవిక దాడి జరుగుతుంటే ఆసుపత్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలియకపోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.ఈ కేసులో నిందితుడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాక్ష్యాలు తారుమారు చేయకుండా ఉండేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరినట్లుగా న్యాయస్థానం పేర్కొంది. గతంలో జరిగిన ఓ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ఆధారంగా న్యాయపరమైన దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా డాక్టర్లు చేపడుతున్న నిరసనలపై స్పందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే పవిత్రమైన బాధ్యత వైద్యులపై ఉన్నందున.. ఆందోళనలను విరమించాలని సూచించింది.కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌పై కోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించి, సెలవుపై పంపాల్సిందిగా ఆదేశించింది.
నివేదిక సమర్పించండి: నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌
జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం కేసుపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని దేశ వైద్య విద్యా నియంత్రణ సంస్థ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించింది. నివేదికను పరిశీలించిన అనంతరం తమ నియమాలకు అనుగుణంగా లేదని భావిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
గొంతు నులిపి..ముఖాన్ని గోడకేసి కొట్టి.. పాశవికదాడి..
పశ్చిమ బెంగాల్‌లో ఒక జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలిని నిందితుడు గొంతునులిమి చంపాడని, ఆ పెనుగులాటలో ఆమె థైరాయిడ్‌ కార్టిలేజ్‌ విరిగిపోయిందని పోస్టుమార్టం నివేదికను బట్టి తెలుస్తోంది.అసహజ లైంగిక చర్య.. పాశవిక దాడి కారణంగా అంతర్గత అవయవాల వద్ద లోతైన గాయం అయినట్లు వెల్లడైంది. ఆగస్టు 9న తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఈ ఘటన జరిగినట్లు సంబంధిత వర్గాల సమాచారం ఆధారంగా విూడియా వర్గాలు పేర్కొన్నాయి.ఉదరభాగం, పెదాలు, వేళ్లు, ఎడమకాలు వద్ద గాయాలున్నాయని, ఆమె కేకలు వినిపించకుండా ఉండేందుకు తలను గోడకు అదిమిపట్టి ముక్కు, నోరు మూసివేసినట్లు ఆ నివేదికలో వెల్లడైంది. అతడి దాడిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆమె ముఖమంతా గోటి గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లు ఆ నివేదికలో ప్రస్తావించారు. అయితే ఆమె కళ్లకు ఎందుకు గాయాలు అయ్యాయో నిర్ధరణ కాలేదు. ఇదిలా ఉంటే.. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి సెమినార్‌ హాల్‌లో గుర్తించారు. ఈ కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌ను అరెస్టు చేశారు.ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న వేళ.. ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ సుదీర్ఘ సెలవులో వెళ్లాలంటూ కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఘోష్‌ నిన్న రాజీనామా చేసిన కొద్దిగంటలకే కలకత్తా మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ సమయంలోనే కోర్టు ఆదేశాలు వచ్చాయి. ‘’ఆసుపత్రిలో పనిచేస్తోన్న వైద్యులకు ప్రిన్సిపలే గార్డియన్‌. ఆయనే ఎలాంటి జాలి చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారు. ఆయన ఎక్కడా పనిచేయకుండా ఇంట్లోనే ఉండాలి’’ అని ఆదేశించింది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఆయన్ను ఎందుకు రక్షిస్తున్నారని ప్రభుత్వం, పోలీసులకు ప్రశ్నలు వేసింది.