తాండూరు కాలుష్యంతో ఊపిరితిత్తుల వ్యాధులు
వ్యాధి నిరోధక చర్యలు పట్టించుకోని అధికారులు
వికారాబాద్,ఫిబ్రవరి18(జనంసాక్షి): తాండూరు పట్టణంలో కాలుష్యం తగ్గుముఖం పట్టినా నివారణ చర్యలు మాత్రం లేకుండా పోయాయి. తాండూరు ప్రాంతంలో ఉన్న సిమెంట్ ప్యాక్టరీలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టక పోవడంతోనే కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి పట్టణ, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం కూడా క్షీణించేందుకు కారణమవుతోందని పలువురు ఆందోళన చెందుతున్నారు. టీబి, ఊపిరి తిత్తుల వ్యాధులు, భవిష్యత్‌లో కూడా ఇలాగే కాలుష్యం జడలు విప్పితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని పేర్కొన్నారు. తాండూరు పట్టణంలోని 16 పార్కులను దత్తత ద్వారా నిర్వహించాలని గతంలో తీర్మానించినా ఎవరూ ముందుకు రాలేదు. ఇటు సిమెంట్ పరిశ్రమలు కాని, అటు నాపరాళ్ల పరిశ్రమల వారు కాని పార్కుల నిర్వహణను పట్టించుకోలేదు. ఏడాది క్రితం దేశ రాజధాని ఢిల్లీలో మోతాదుకు మించి కాలుష్యం ఉన్నట్లు గుర్తించడంతో నియంత్రణ చర్యల్లో భాగంగా సరి, బేసి విధానాన్ని అమలు చేసి కొంతమేర నియంత్రించ గలిగారు. అయితే ఢిల్లీ కంటే రెట్టింపు స్థాయిలో తాండూరులో కాలుష్యం ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి నివేదికల్లో స్పష్టంకాగా తగు చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం తాండూరులో కాలుష్యం తగ్గు ముఖం పట్టినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక్కడ సిమెంట్, నాపరాయి గనుల కారణంగా కాలుష్యం తీవ్రత ఉంది. పట్టణంతో పాటు పరిసరాల్లో ఉన్న 800కి పైగా పాలిషింగ్ యూనిట్లు, ఐదు సిమెంటు ఫ్యాక్టరీల కారణంగా గాలి విషతుల్యంగా మరింది. దీనిపై పర్యావరణ ప్రేమికులు, పట్టణవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అత్యంత జనసాంద్రత కలిగిన దేశ రాజధాని కంటే ఎక్కువగా నమోదైన కాలుష్యం ఈ సారి గణనీయంగా తగ్గినట్లు అధికారిక లెక్కలు తేల్చుతున్నాయి. అప్పట్లో ఇది ఢిల్లీ కన్నా రెట్టింపుగా నిర్దారణ అయింది.అయితే తాండూరు పట్టణంలో అంతకు దాదాపు రెట్టింపుగా కాలుష్యం మోతాదు నమోదైనా ఆ తరువాత మాత్రం తగిన రీతిలో రక్షణ చర్యలు చేపట్టలేక పోయారు. కేవలం తాండూరు రైల్వే స్టేషన్ నుండి వ్యాగన్లలో సిమెంట్ లోడింగ్ పనులను మాత్రం నిలిపి వేశారు. తాండూరు పరిసరాల్లో 15 నుండి 20 కిలోవిూటర్ల పరిధిలో ఐదు సిమెంట్ కర్మాగారాలు ఉండడంతో పాటు వందల సంఖ్యలో పాలిషింగ్ యూనిట్లు, నాపరాల్ల క్వారీలు, సుద్ధ గనులు, ల్యాటరైట్ గనులు ఉండడంతో పట్టణం విూదుగా ప్రతి రోజు 5 వేల రవాణా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ కారణంగా పట్టణంలోని రోడ్లు దారుణంగా తయారవుతున్నాయి. సిమెంట్ కర్మాగారాలకు ప్రతిరోజు బొగ్గును, రాళ్లను, ల్యాటరైట్‌ను(ఎర్రమట్టిని) చేరవేసే లారీలు వందల సంఖ్యలో తిరుగుతుండడంతో పట్టణంలో కాలుష్యం మరింతగా వ్యాప్తి చెందుతోంది. పట్టణానికి చేరువలో రెండు స్టోన్ క్రషర్ యూనిట్లు, నాలుగైదు సుద్ధ ప్యాక్టరీలు కూడా ఉండడంతో కాలుష్యం మోతాదు అంతకంతకు పెరుగుతోంది. దీంతో ఒకటి, రెండు పార్కులు మినహా ప్రస్తుతం మిగిలిన పార్కులన్ని దుర్గంధ భరితంగానే ఉన్నాయి. తాండూరు పరిసరాల్లో వందల సంఖ్యలో ఉన్న నానరాళ్ల పాలిషింగ్ యూనిట్లు తాం డూరు పట్టణంలో కాలుష్యం పెంచి పోషిస్తున్నాయి. ఈ వ్యర్థాల కారణంగా తాండూరు పట్టణ పరిసరాల్లోని ప్రధాన ఆర్‌అండ్‌బి రహదారులు త్వరగానే పాడవుతున్నాయి. పాలిష్ చేసే సమయంలో ఇసుక పౌడర్‌గా మారి సుద్ధ రూపంలో బయటకు వస్తోంది. ఇలాంటి వ్యర్థాలను కూడా పాలిషింగ్ యూనిట్ల వారు రోడ్ల ప్రక్కన వేస్తున్నారు. దీంతో రోడ్లపై వాహనాలు వెల్లిన సమయంలో కాలుష్యం వెదజల్లుతోంది. తాండూరు పట్టణం పరిసరాల్లో నాపరాళ్ల వ్యర్థాలతో కాలుష్యం వాప్తి జరగకుండా చేయాలంటే ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకు లైమ్ తయారి కంపెనీలు ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుంది. నాపరాళ్ల వ్యర్థాలను వినియోగించి ఉత్పత్తి చేసే లైమ్ పౌడర్‌ను రంగుల తయారీ కంపెనీలు, సబ్బుల తయారు కంపెనీలు, ఎరువుల తయారి కంపెనీలు, ముడి చమురు శుద్ధి చేసే కంపెనీలు ఎక్కువగా వినియోగించేందుకు ఆస్కారముంటుంది.