తెలంగాణలో భానుడి భగభగ

01hsb22
 హైదరాబాద్‌: వేసవి ఎండల వేడి తెలంగాణలో మరోసారి తీవ్రస్థాయికి చేరుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రమంతా ఉడుకుతోంది. సోమ, మంగళవారాల్లో మరింత వేడి నమోదవుతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఆదివారం అత్యధికంగా రామగుండంలో 46.2, భద్రాచలంలో 45.4, ఆదిలాబాద్‌లో 45.3, ఖమ్మంలో 44.4, హైదరాబాద్‌లో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం నుంచి మరో ఒకటీ, రెండు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా. గత పదేళ్లలో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత 2010 మే 26న రామగుండంలో 47.2 డిగ్రీలుగా నమోదైంది. దీనికన్నా సరిగ్గా ఒక్క డిగ్రీ మాత్రమే తక్కువగా ఆదివారం రామగుండంలో 46.2 డిగ్రీలు నమోదైంది. పదేళ్ల రికార్డులన్నీ మరో రెండు, మూడు రోజుల్లో మారిపోయే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ భారతం నుంచి పొడిగాలులు తెలంగాణ మీదుగా విదర్భ వైపు వీస్తుండటంతో ఇక్కడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలిలో తేమ బాగా తగ్గి వడగాలులుగా మారుతున్నాయి.