తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు అరకొర

గోదావరిఖని, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రాంతంలో అవసరానికి సరిపడా విద్యుత్తు ఉత్పత్తి అందుబాటులో లేదని, అందుకే మరిన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రితో పాటు జెన్‌కో సి.ఎం.డి.ని కలిసి రామగుండం బి-థర్మల్‌ విద్యుత్తు కేంద్రం విస్తరించాలని కోరినట్లు తెలిపారు. గోదావరిఖనిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో కేంద్రాలు తక్కువగా ఉండడంతో సరఫరాకు సరిపడా విద్యుత్తు అందించలేకపోతున్నారని, అదే సీమాంధ్ర ప్రాంతంలో సరఫరాకు మించి విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ విద్యుత్తు కేంద్రంతో పాటు రామగుండం విద్యుత్తు కేంద్రాన్ని కూడా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందిచి రామగుండం, కొత్తగూడెం విద్యుత్తు కేంద్రాల విస్తరణకు కూడా చర్యలు చేపడతామని వెల్లడించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. అదే విధంగా నిలిచిపోయిన బి.పి.ఎల్‌. స్థానంలో జెన్‌కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం కూడా నెలకొల్నాలని కోరినట్లు వెల్లడించరు. బొగ్గు, నీరు అందుబాటులో ఉన్న రామగుండం ప్రాంతంలో కేంద్రాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఓదెలు, బాలరాజు, మొగిలి, వెంకటి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.