తెలంగాణ ప్రభుత్వం.. హద్దులువిూరుతుంది


– పిల్లచేష్టలతో హైదరాబాద్‌ ఇమేజ్‌కు నష్టంతెస్తున్నారు
– అహంభావంతో కేసీఆర్‌, అసహనంతో జగన్‌ దుర్మార్గాలు చేస్తున్నారు
– పార్టీ సమాచారాన్ని దొంగిలించి వైకాపాకు ఇచ్చారు
– ప్రభుత్వ సమాచారమని అసత్య ప్రచారం చేస్తున్నారు
– మోదీ, కేసీఆర్‌, జగన్‌లు ముసుగుతీసి ప్రచారం చేయాలి
– జగన్‌ను లొంగదీసుకుని ఏపీపై దాడులకు తెగబడ్డారు
– ఆంధప్రదేశ్‌ ఆర్ధిక మూలాలపై దాడులు చేయడం హేయమైన చర్య
– ఏపీపై కుట్రలు చేసేవారికి గుణపాఠం చెబుతాం
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మార్చి5(జ‌నంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం హద్దులు విూరి ప్రవర్తిస్తుందని, జగన్‌ను లొంగదీసుకొని ఏపీపై కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళవారం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు..
అహంకారం నెత్తికెక్కి తెరాస విపరీత చేష్టలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఏ వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని.. అలాంటి ఆస్తికి హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని సీఎం మండిపడ్డారు. పిల్లచేష్టలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కు నష్టం కలిగిస్తున్నారని.. ఎవరైనా సమాచారాన్ని ఇకపై హైదరాబాద్‌లో పెడతారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అహంభావంతో కేసీఆర్‌, అసహనంతో జగన్‌ దుర్మార్గాలకు పాల్పుడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏ పార్టీకి లేని సాంకేతిక తెదేపా సొంతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ 24 ఏళ్లు కష్టపడి కార్యకర్తల సమాచారం సేకరిస్తే.. దానిని దొంగిలించి వైకాపాకి ఇచ్చారని సీఎం దుయ్యబట్టారు. ప్రభుత్వ సమాచారమని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తెదేపా సమాచారం కొట్టేసి పార్టీపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగు తీసి ప్రచారం చేయాలని.. ప్రజలే విూ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌కు సామంత రాజుగా జగన్‌ మారారని దుయ్యబట్టారు. ఆంధప్రదేశ్‌ని సామంత రాజ్యం చేయాలనేదే కేసీఆర్‌ కుట్ర అని ఆరోపించారు. జగన్‌ను లొంగదీసుకుని ఏపీపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ఆంధప్రదేశ్‌ ఆర్ధిక మూలాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని సీఎం మండిపడ్డారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫారమ్‌ – 7 దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు. నేరస్థుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటాయని చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులో నాలుగు చోట్ల ఎన్టీఆర్‌ విగ్రహాలు ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జగన్‌ అరాచకాలకు
పాల్పడుతున్నారన్నారు. ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు, ఎన్టీఆర్‌ విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వైకాపా తప్పుడు విధానాలను ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ర్యాలీలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ ఓపికకు కూడా ఓ పరిమితి ఉంటుందని, అహంకారంతో ఏదైనా చేస్తామంటూ చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు.